రాజకీయ సన్యాసం: రిజర్వేషన్లపై గంటా సంచలనం, ముద్రగడ రెచ్చడొడుతున్నారని చినరాజప్ప
అమరావతి: కాపు రిజర్వేషన్ల పేరుతో పాదయాత్ర చేపట్టిన ముద్రగడ పద్మనాభంపై ఆంధ్రప్రదేశ్ మంత్రులు గంటా శ్రీనివాసరావు, చినరాజప్ప తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పాదయాత్రల పేరుతో విద్వేషాలు రెచ్చగొడితే సహించేది లేదని గంటా స్పష్టం చేశారు. పాదయాత్రకు ఎందుకు అనుమతి తీసుకోలేదని ప్రశ్నించారు.

ముద్రగడ వెనుక ఎవరున్నారో తెలుసు
ముద్రగడ ట్రాక్ రికార్డును దృష్టిలో పెట్టుకునే పాదయాత్రకు అనుమతివ్వలేదని గంటా చెప్పారు. ముద్రగడను నడిపించే ఆ శక్తి ఎవరో తమకు తెలుసునని అన్నారు. ముద్రగడ రాజకీయ హడవుడిలో యువత పడొద్దని సూచించారు. భవిష్యత్ పణంగా పెట్టి నష్టపోవద్దని అన్నారు.
Recommended Video


రాజకీయ సన్యాసమే..
కాపులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటామని గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. కాపు రిజర్వేషన్ల ద్వారా ఎన్ని రుణాలిచ్చామో శ్వేతపత్రం విడుదల చేస్తామని చెప్పారు.

రెచ్చగొట్టొద్దు..
ముద్రగడ రెచ్చగొట్టేలా వ్యవహరించడం సరికాదని హోంమంత్రి చినరాజప్ప అన్నారు. పంతం నెగ్గించుకోవాలనే పాదయాత్ర అనుమతి తీసుకోవడం లేదని అన్నారు. అనుమతి తీసుకోనిదే పాదయాత్ర జరగనివ్వమని చినరాజప్ప స్పష్టం చేశారు.

బాబుకే అనుమతి తీసుకున్నాం
చంద్రబాబునాయుడు నిర్వహించిన పాదయాత్రకు కూడా తాము అనుమతి తీసుకున్నామని చెప్పారు. ముద్రగడ మాత్రం అనుమతి తీసుకోవడం లేదని అన్నారు. తుని ఘటన దృష్ట్యానే ముద్రగడ పాదయాత్రకు అనుమతి ఇవ్వలేదని చెప్పారు. తుని ఘటన కారణంగానే భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కాపులకు రాజకీయ రిజర్వేషన్లు అవసరం లేదని చినరాజప్ప చెప్పారు.

జగనేం చేశారు?
ముద్రగడ వెనుక వైయస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారని ఆయన ఆరోపించారు. కానీ, వైసీపీ ప్లీనరీలో మాత్రం కాపుల గురించి ఒక్క మాట కూడా జగన్ మాట్లాడలేదని చినరాజప్ప అన్నారు. కాపుల రిజర్వేషన్లపై త్వరలోనే మంజునాథ కమిషన్ నివేదిక వస్తోందని తెలిపారు.

24గంటల నిర్బంధం
ఇది ఇలా ఉండగా, ముద్రగడ పాదయాత్రకు అనుమతి లేనందునే అడ్డుకున్నామని పోలీసులు తెలిపారు. ఎవరినీ అరెస్ట్ చేయలేదని చెప్పారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. కాగా, తమ హక్కులను కాలరాస్తున్నారని ముద్రగడ ఆరోపించారు. ముద్రగడను అడ్డుకున్న పోలీసులు.. 24గంటలపాటు గృహ నిర్బంధం విధించారు.












Click it and Unblock the Notifications