ఈసారి పోటీ చేసే సీటుపై గంటా సంకేతం ? బొత్స ఓడిపోలేదా అని ప్రశ్న..
ఏపీలో ఎన్నికల వేళ రాజకీయ పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ముఖ్యంగా జగన్ విశాఖ టూర్ లో చేసిన వ్యాఖ్యలపై స్ధానిక టీడీపీ నేతలు కౌంటర్లు వేస్తున్నారు. ఇదే క్రమంలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా స్పందించారు.జగన్ మోహన్ రెడ్డి విజన్ విశాఖ డాక్యుమెంట్ నిన్న విడుదల చేయడానికి సిగ్గు ఉందా అని గంటా ప్రశ్నించారు. 2019 ఎన్నికల్లో రాష్ట్ర అంతట వైసిపి విజయం సాధించినా, విశాఖలో మాత్రం టీడీపీ గెలిచిందని గుర్తుచేశారు.
జగన్ మోహన్ రెడ్డిని విశాఖ వాసులు నమ్మరని గంటా శ్రీనివాస్ తెలిపారు. ఐదు సంవత్సరాల్లో జగన్ సర్కార్ విశాఖలో ఏమి చేయలేదన్నారు. విశాఖ రైల్వేజోన్,మెట్రో గాలికి వదిలేసారని గంటా మండిపడ్డారు. విశాఖలో ట్రాఫిక్ నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. జగన్ మోహన్ రెడ్డి విశాఖ వస్తాననేది కేవలం కల మాత్రమేనన్నారు. విశాఖలో ఉన్న ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టారని విమర్శించారు. జగన్ మోహన్ రెడ్డికి ఈ రాష్ట్రంతో ఋణం తీరిపోయిందని గంటా తెలిపారు.
అమరావతి రాజధానిగా ఉండాలని జగన్ అసెంబ్లీలో చెప్పారని, తిరిగి విశాఖ రాజధాని అంటూ ఏం చేశారని గంటా ప్రశ్నించారు.

మరోవైపు చీపురుపల్లికి మారి బొత్స సత్యనారాయణపై గంటా పోటీ చేస్తారంటూ జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో గంటా స్పందించారు. తన పోటీపై త్వరలోనే క్లారిటీ వస్తుందన్నారు. తనపై బొత్స సత్యనారాయణ చేస్తున్న వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆయనకు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అనుభవం ఉందన్నారు. తనకు మాత్రం ఓడిపోయిన అనుభవం లేదన్నారు. తద్వారా చీపురుపల్లిలో అయినా పోటీకి తాను సిద్ధంగానే ఉన్నట్లు గంటా సంకేతాలు ఇచ్చారు.












Click it and Unblock the Notifications