ఏపీ సచివాలయానికి జీహెచ్‌ఎంసీ నోటీసులు, బస్సులోనే నిద్రించనున్న బాబు
హైదరాబాద్: పాత బకాయిలను తక్షణమే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్‌ఎంసీ) నోటీసులు జారీ చేసింది. రూ. 22 కోట్ల మేరకు ఏపీ సచివాలయం బకాయి పడిందని, వీటిని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ గురువారం ఉదయం జీహెచ్‌ఎంసీ నోటీసులు జారీ చేసింది.

ఓటుకు నోటు వ్యవహారంలో ఇప్పటికే ఇరు రాష్ట్రాల మధ్య వివాదం నెలకొన్న సమయంలో జీహెచ్‌ఎంసీ నోటీసులు పంపించడం మరింత గందరగోళంగా మారనుంది. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కావడంతో నగరంలోని పలు భవనాలను అటు తెలంగాణ, ఇటు ఏపీ ప్రభుత్వాలు సంయుక్తంగా వినియోగించుకుంటున్న సంగతి తెలిసిందే.
హైదరాబాద్‌లో ఉన్న ఈ భవనాలన్నీ జీహెచ్‌ఎంసీకి కోట్ల రూపాయల్లో బకాయిలు పడ్డాయి. తాజాగా ఏపీకి చెందిన భవనాలకు నోటీసులు పంపించి, బకాయిలను తక్షణమె చెల్లించాలంటూ గ్రేటర్ అధికారులు ఓ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
బస్సులోనే నిద్రించనున్న ఏపీ సీఎం బాబు
ఉభయ గోదావరి జిల్లాల పర్యటనకు బయలుదేరి వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గురువారం రాత్రి విజయవాడలోనే బస చేయనున్నారు. విజయవాడలో సీఎం క్యాంప్ ఆఫీసు ప్రారంభమైన, బస చేసేందుకు సరైన వసతి సౌకర్యం లేకపోవడంతో బస్సులోనే చంద్రబాబు నిద్రించనున్నారు.
రాబోయే రోజుల్లో వారంలో మూడు రోజులు పాటు విజయవాడలోనే ఉండాలని నిర్ణయించుకున్న చంద్రబాబు, అందుకు అవసరమైన తాత్కాలిక నివాసాన్ని ఎంపిక చేయాలని అధికారులకు ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో రంగంలోకి దిగిన అధికారులు కృష్ణ కరకట్టపై ఉన్న లింగమనేని గెస్ట్ హౌస్‌ను ఎంపిక చేశారు.












Click it and Unblock the Notifications