'ముందు రోజే చంద్రబాబుతో మాట్లాడిన భూమా, వారి మధ్య ఏం జరిగింది?'
భూమా నాగిరెడ్డి చనిపోవడానికి ముందు రోజు.. ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోనే మాట్లాడారని, వారి మధ్య ఏం జరిగిందో తెలియాలని వైసిపి ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మంగళవారం డిమాండ్ చేశారు.
విజయవాడ: భూమా నాగిరెడ్డి చనిపోవడానికి ముందు రోజు.. ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోనే మాట్లాడారని, వారి మధ్య ఏం జరిగిందో తెలియాలని వైసిపి ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మంగళవారం డిమాండ్ చేశారు.
వైసిపి ఎమ్మెల్యేలు మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. ఈ సందర్భంగా ఈశ్వరి మాట్లాడారు. అఖిలప్రియను బలవంతంగా సభకు తీసుకు వచ్చారన్నారు.మంత్రి పదవి ఇస్తామని ప్రలోభ పెట్టి భూమాను, అఖిలను టిడిపిలోకి తీసుకున్నారన్నారు.

పదవి ఇస్తామని చంద్రబాబు టెన్షన్ పెట్టారు
చంద్రబాబు ఆయనకు పదవి ఇస్తామని చెప్పి టెన్షన్ పెట్టారని ఈశ్వరి తెలిపారు. ఆ ఒత్తిడి వల్లే ఆయన మృతి చెందారని అభిప్రాయపడ్డారు. రాజకీయ భిక్ష పెట్టిన ఎన్టీఆర్‌కే చంద్రబాబు వెన్నుపోటు పొడిచారన్నారు. అన్నింటిని ప్రజలు గమనిస్తున్నారన్నారు.
అసెంబ్లీ సాక్షిగా అఖిల ప్రియతో అబద్దాలు చెప్పించారన్నారు. భూమాకు సంతాప తీర్మానం కార్యక్రమమా లేక జగన్ పైన విమర్శల కార్యక్రమమా అనే అనుమానం కలుగుతోందన్నారు.

టిడిపిలో ఉన్నప్పుడు శోభా కీలకం కానీ..
భూమా సతీమణి శోభా నాగిరెడ్డి ఒకప్పుడు టిడిపిలో కీలక పాత్ర వహించారని, ఆ పార్టీకి ఎంతో చేశారన్నారు. అలాంటిది ఆమె చనిపోయినప్పుడు సంతాపం తెలిపేందుకు టిడిపి నేతలు ఎందుకు రాలేదో చెప్పాలన్నారు.

పోటీకి నిలబెట్టారు
అసెంబ్లీలో శోభా నాగిరెడ్డికి సంతాప తీర్మానం తెలిపేందుకు కూడా టిడిపి ఇష్టపడలేదన్నారు. గతంలో చంద్రబాబు ప్రవర్తించిన తీరు ఇప్పుడు గుర్తుకు రావడం లేదా అని ప్రశ్నించారు. శోభ చనిపోతే ఆ స్థానంలో ఉప ఎన్నికలు జరిగితే అదే చంద్రబాబు తమ పార్టీ అభ్యర్థిని నిలబెట్టారని గుర్తు చేశారు.

భూమాపై రౌడీషీట్.. కేసులతో వేధింపు
భూమా వైసిపిలో ఉన్నప్పుడు రౌడీషీట్ పెట్టించారన్నారు. పోలీసులతో అరెస్టు చేయించి వేధింపులకు గురి చేశారన్నారు. భూమాను కేసులతో వేధించింది టిడిపియే అన్నారు. పార్టీ మారితే మూడు రోజుల్లో మంత్రి పదవి ఇస్తామని చెప్పి, ఏడాది దాటినా ఇవ్వలేదన్నారు. దీంతో భూమా మానసిక క్షోభకు గురయ్యారన్నారు.
చనిపోయినప్పుడు భూమాపై ప్రేమ ఒలకపోస్తున్న చంద్రబాబు, బతికున్నప్పుడు ఏం చేశారని ప్రశ్నించారు.
హిందూ సంప్రదాయం ప్రకారం కుటుంబంలో వ్యక్తి చనిపోతే ఆ కుటుంబ సభ్యులు కనీసం మూడు రోజులు ఊరి పొలిమేర దాటరని, అఖిలను మాత్రం ఇప్పుడే సభకు తీసుకు వచ్చారన్నారు. అమాయకురాలి చేత సభలో అబద్దాలు చెప్పించారన్నారు.












Click it and Unblock the Notifications