పెళ్లి దాక వెళ్లని మూడేళ్ల ప్రేమ: ప్రియుడి ముందే ప్రియురాలి ఆత్మహత్య
విశాఖపట్నం: జిల్లాలోని ఆనందపురంలో విషాద ఘటన ఘటన చోటుచేసుకుంది. తనను వివాహం చేసుకోనని ప్రియుడు చెప్పడంతో తీవ్ర మనస్తాపానికి గురైన యువతి.. అతని ముందే పురుగులమందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆనందపురం మండలంలోని పందలపాక కాలనీకి చెందిన యర్రా వరలక్ష్మి(20) తన ప్రియుడు వీసు చిన్నా ఇంటి ముందు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికంగా ఈ ఘటన మంగళవారం కలకలం రేపింది.

మూడేళ్లుగా ప్రేమ
ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పందలపాక గ్రామ పంచాయతీ పరిధిలోని కాలనీలో నివసిస్తున్న ఎర్రా రాము, కామమ్మ దంపతుల కుమార్తె వరలక్ష్మి, వారి ఎదురింట్లోని వీసు చిన్నా గత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.

నిశ్చితార్థం చేసుకుని..
మూడు నెలల క్రితం పెద్దల సమక్షంలో వరలక్ష్మి, వీసు చిన్నాకు నిశ్చితార్థం జరిగింది. మంగళవారం ఉదయం వరలక్ష్మి తండ్రి మంచిరోజులు వస్తున్నాయని పెళ్లి ముహూర్తాలు పెట్టుకుందామని చిన్నా తల్లిదండ్రుల సమక్షంలో అడిగేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

మనస్తాపానికి గురైన వరలక్ష్మి
అంతేగాక, వరలక్ష్మి తల్లిదండ్రులను చిన్నా తీవ్రంగా కొట్టడంతో ఆమె మనస్తాపానికి గురైంది. తన తల్లిదండ్రులను కొట్టడం మంచిపద్ధతి కాదని చెప్పింది. ఆగ్రహానికి గురైన చిన్నా ఆమెను పెళ్లిచేసుకోనని అన్నాడు. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన యువతి క్షణికావేశానికి గురై తన ఇంటికి వెళ్లి పురుగులమందు తీసుకొని వచ్చి ప్రియుడి ఇంటి ఆవరణలోనే అతని ముందే తాగి బలవన్మరణానికి పాల్పడింది. దీనిపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

వీసు అరెస్ట్..
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చిన్నాను అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమిలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వరలక్ష్మి మృతితో ఆమె కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.












Click it and Unblock the Notifications