సంచలనం: దేవుడు రమ్మంటున్నాడంటూ.. ఉరేసుకున్న ముగ్గురు మహిళలు
దేవుడు తమను పిలుస్తున్నాడని చెప్పి కాకినాడ రూరల్ మండలం కరపకు చెందిన సత్తి ధనలక్ష్మి, సత్తి వైష్ణవి, రాశంశెట్టి సత్యవతి అనే మహిళలు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
కాకినాడ: తూర్పుగోదావరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. వింత ఏమిటంటే.. దేవుడు తమను పిలుస్తున్నాడని చెప్పి మూకుమ్మడిగా ఆత్మహత్యలకు పాల్పడడం.
చదవండి: నటిపై లైంగికదాడి యత్నం కేసులో ప్రముఖ హీరో అరెస్టు
కాకినాడ రూరల్ మండలం కరపలో ఈ ఉదంతం సంచలనం సృష్టించింది. కరపకు చెందిన సత్తి ధనలక్ష్మి(42), ఆమె అక్క రాసంశెట్టి సత్యవేణి(48) ఎనిమిదేళ్ల క్రితం మతం మార్చుకున్నారు.

ధనలక్ష్మి కుమారుడు రఘువీర్ జన్మదినం సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం వేడుకలు నిర్వహించారు. భోజనాలు కూడా పెట్టారు. అనంతరం రాత్రి ధనలక్ష్మి, సత్యవేణి, ధనలక్ష్మి కుమార్తె వైష్ణవి ప్రార్థనా మందిరానికి వెళ్లి అక్కడే ఉండిపోయారు.
సోమవారం ఉదయం ఇంటికి తిరిగొచ్చిన వీరు తమ కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ.. తమను దేవుడు పిలుస్తున్నాడని చెప్పడం మొదలుపెట్టారు. ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు ఇంట్లోనే ప్రార్థనలు చేశారు. ఆ తరువాత గది తలుపులు వేసుకున్నారు.
గదిలోంచి మాటలు వినపడకపోవడాన్ని గమనించిన రఘువీర్ లోపలికి వెళ్లి చూడగా ముగ్గురూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుని కనిపించారు. మూఢనమ్మకమే వీరి బలవన్మరణానికి కారణంగా తెలుస్తోంది. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది.
ఈ విషయం తెలుసుకున్న ఇన్ ఛార్జి డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు, కాకినాడ పోర్టు సీఐ రాజశేఖర్, ఇంటెలిజెన్స్ సీఐ నూనె రమేష్, ఎస్సై ఎం. జానకీరామ్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.
అనంతరం మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు.
కొంతకాలంగా వీరు పూజలు చేస్తూ.. దేవుడు తమతో మాట్లాడుతున్నాడని, తన వద్దకు రమ్మంటున్నాడని చెప్పేవారని వారి కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసులు ముగ్గురి మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు.












Click it and Unblock the Notifications