పవన్, బాబుకు సెంటిమెంట్, జగన్‌ని ముంచుతాయా?
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల మధ్య ప్రస్తుతం 'సెంటిమెంట్' సస్పెన్స్ కొనసాగుతోంది. సీమాంధ్రలో తాము అధికారంలోకి వస్తామంటే తాము వస్తామని ఇరు పార్టీలు బల్ల గుద్ది మరీ చెబుతున్నాయి! అయితే, మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫలితాల అనంతరం వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో కొంత అలజడి ప్రారంభమైందని అంటున్నారు. సీమాంధ్రలో తమకు తిరుగులేదని, జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఆ పార్టీ వర్గాలు మొదటి నుండి ధీమాగా ఉన్నాయి.
కానీ మున్సిపల్, ప్రాదేశిక ఫలితాలు చూస్తే మాత్రం జగన్ పార్టీకి ఆశాజనకంగా కనిపించడం లేదు. దీనికి తోడు సెంటిమెంట్ కూడా తెలుగుదేశం పార్టీ వైపే మొగ్గు చూపింది. గోదావరి జిల్లాల్లో ఏ పార్టీ ఎక్కువ స్థానాలు సాధిస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుందనే సెంటిమెంట్ ఉంది. అది పలు పర్యాయాలు నిరూపితమైందని కూడా చెబుతున్నారు. మొన్న, నిన్న విడుదలైన స్థానిక ఫలితాలలో గోదావరి జిల్లాల్లో మెజార్టీ స్థానాల మాట పక్కన పెడితే... పూర్తిగా ఏకపక్షంగా ఫలితాలు కనిపించాయి.

ఉభయ గోదావరి జిల్లాలు పూర్తిగా టిడిపి వైపుకు మొగ్గు చూపాయి. జగన్ పార్టీ కనీస స్థానాలు కూడా గెలుచుకోలేకపోయింది. స్థానిక ఫలితాల నేపథ్యంలో మొదటి నుండి ఆ రెండు జిల్లాల పైన గట్టి ఆశలు పెట్టుకున్న వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఆశలను అవి ముంచి వేయనున్నాయా? అనే చర్చ సాగుతోంది. కొద్దో గొప్ప స్థానాలు సాధించినా ఆ పార్టీలో ఇంత అలజడి కనిపించక పోయేదని, ఏమాత్రం ప్రభావం చూపించక పోవడం వారిని ఆందోళనకు గురి చేస్తోందని అంటున్నారు.
సీమాంధ్రలో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు ఉంటే.. అందులో 34 స్థానాలు ఉభయ గోదావరి జిల్లాల్లోనే ఉన్నాయి. సమైక్య రాష్ట్రంలోనే.. ఈ జిల్లాల్లో ఎక్కువ స్థానాలు గెలిచిన పార్టీనే విజయం వరిస్తుందనే వాదన ఉండేది. ఇప్పుడు విభజన నేపథ్యంలో స్థానాలు తగ్గి.. అక్కడ టిడిపి సత్తా చూపితే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ భావించినట్లుగా అధికారం చేపట్టడం అంత సులభం కాదనే అంటున్నారు. మొత్తంగా జిల్లాల్లో చూసినా టిడిపియే సత్తా చూపిందని గుర్తు చేస్తున్నారు.
రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్ర ప్రజలు అభివృద్ధి చేసే నాయకుడి వైపు మొగ్గు చూపారని టిడిపి నేతలు చెబుతున్నారు. బాబు హయాంలో హైదరాబాదును ఎంతగా అభివృద్ధి చేశారో సీమాంధ్రులు గుర్తించారని, అలాంటి నగరాలు సీమాంధ్రలో కావాలంటే చంద్రబాబు రావాలని సీమాంధ్రులు నిర్ణయించుకున్నారని, అందుకే తమకు ఓటేశారని అంటున్నారు. అభివృద్ధి, అనుభవం కలిగిన నాయకుడికే ప్రజలు పట్టం కట్టారని చెబుతున్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఊరట
స్థానిక ఫలితాలు తమకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఓ అంశం ఊరట కలిగిస్తోంది. అన్నిటికంటే ముందు జరిగిన మున్సిపల్ ఫలితాల్లో టిడిపి ప్రభంజనం కనిపించింది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చిత్తయింది. అదే ప్రాదేశిక ఫలితాల విషయానికి వస్తే మాత్రం టిడిపికి పోటీని ఇచ్చింది. ఈ లెక్కన ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ, లోకసభ ఫలితాలు తమకే అనుకూలంగా ఉంటాయని చెబుతున్నారు.
దీనిపై టిడిపి వాదన మరోలా ఉంది. మున్సిపల్ ఎన్నికల్లో పట్టణ ఓటర్లు అంతా అభివృద్ధి కోసం టిడిపి వైపు మొగ్గు చూపారని, గ్రామీణ ప్రాంతాల్లో ఈవాదన క్రమంగా వెళ్లిందని, ఆ కారణంగానే ఈ ఫలితాలు కూడా తమకే అనుకూలంగా ఉన్నాయని, అసెంబ్లీ, లోకసభ ఎన్నికల నాటికి చంద్రబాబు వైపు అందరూ మొగ్గు చూపారని, తాము భారీ మెజార్టీలతో వందకు పైగా సీట్లు తప్పకుండా గెలుచుకుంటామని చెబుతున్నారు. కొత్త రాష్ట్రంలో కొత్త రాజధాని, అభివృద్ధి బాబు వల్లే సాధ్యమని అందరు విశ్వసిస్తున్నారన్నారు.
మోడీ, పవన్ ప్రభావంపై భిన్న వాదనలు
గుజరాత్ ముఖ్యమంత్రి, బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రభావం కూడా టిడిపి, బిజెపి కూటమి గెలుపుపై పడతుందని అంటున్నారు. మోడీ వేవ్, పవన్ మద్దతు తమకు కలిసి వస్తుందని వారు చెబుతున్నారు. అయితే బిజెపితో కలవకముందు జరిగిన స్థానిక ఫలితాల్లో టిడిపి సత్తా చాటిందని, సార్వత్రిక ఎన్నికల సమయంలో మోడీ, బాబు కలిశారని, దీంతో మైనార్టీలు టిడిపికి దూరమయ్యారనే వాదన కూడా లేకపోలేదు.
తెలంగాణలో పోటాపోటీ
తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్ర సమితి, కాంగ్రెసు పార్టీ పోటా పోటీగా తాము గెలుస్తామంటే తాము గెలుస్తామని చెబుతున్నాయి. మున్సిపల్ ఫలితాలు తమకు అనుకూలంగా ఉన్నాయని, ఎంపీటీసీ, జెడ్పీటీసీల్లో మిశ్రమ ఫలితాలు వచ్చాయని, అసెంబ్లీ, లోకసభ ఎన్నికలలో తమదే గెలుపు అని కాంగ్రెసు చెబుతుంటే, తాము 70 -80 సీట్లు గెలుచుకొని ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని తెరాస చెబుతోంది.












Click it and Unblock the Notifications