కిరణ్‌కు మళ్లీ పిలుపు, టిపై తగ్గమని కన్నాకు సోనియా
హైదరాబాద్/న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి మంత్రుల బృందం (జివోఎం) నుండి మరోసారి పిలుపు వచ్చింది. ఈ నెల 18వ తేదీన తమ ముందు హాజరు కావాలని జివోఎం కిరణ్‌కు సూచించింది. షెడ్యూలు ప్రకారం గురువారం రాత్రి ఎనిమిది గంటలకు కిరణ్ జివోఎం సభ్యులను కలవాల్సి ఉంది. రచ్చబండ నేపథ్యంలో ఆయన ఢిల్లీకి వెళ్లడం లేదు. దీంతో 18వ తేదీన రావాలని పిలుపు వచ్చింది.
వెనక్కి తగ్గమని సోనియా చెప్పారు
తెలంగాణపై ఈ దశలో వెనక్కి పోయే పరిస్థితి లేదని ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ తనతో అన్నారని మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ గురువారం అన్నారు. తాను ముఖ్యమంత్రి రేసులో ఉన్నాననే వార్తలు అవాస్తవమన్నారు. తన వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతీసేందుకు కొందరు ఇలాంటి ప్రచారం చేస్తున్నారని ఆగ్రహించారు.

తనకు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ నుండి పిలుపు రాలేదని, తానే అపాయింటుమెంట్ తీసుకొని కలిశానని చెప్పారు. రాష్ట్రంలోని తాజా పరిస్థితులను వివరించానని, సమైక్యంగానే ఉంచాలని కోరానన్నారు. అయితే సిడబ్ల్యూసి నిర్ణయం నుండి వెనక్కి పోలేమని సోనియా చెప్పారన్నారు. సమైక్యంగా ఉంచలేనప్పుడు సీమాంధ్రకు న్యాయం చేయాలని తాను కోరగా, జివోఎంకు సమస్యలను చెప్పాలని సూచించారన్నారు.
పట్టించుకోవాల్సిన అవసరం లేదు: జానా రెడ్డి
తెలంగాణ ప్రాంత మంత్రుల ఆమోదం లేకుండా జివోఎంకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నివేదిక ఇచ్చినప్పుడు దానిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని మంత్రి జానా రెడ్డి అన్నారు. తాము జివోఎంను కలిసేందుకు రేపు ఢిల్లీ వెళ్తున్నామన్నారు. పార్టీ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందేనన్నారు. విభజనతో ప్రజలకు ఇబ్బందులు వస్తాయన్నప్పుడు అవేమిటో జివోఎం ముందుకు ముఖ్యమంత్రి తీసుకు వెళ్లాలని సూచించారు.












Click it and Unblock the Notifications