ఏపీలో చంద్రబాబు మరో పథకం.. లబ్ధిదారులకు రూ.10 లక్షలు!!
ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం కొన్ని పథకాలను అమలు చేసేందుకు వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా చంద్రన్న బీమా పథకాన్ని అమలుచేయబోతోంది. పేదలు, కార్మికులు, అసంఘటిత రంగంలో పనిచేసేవారికి ఈ పథకం భద్రత కల్పిస్తోంది. శాశ్వతమైన వైకల్యంతో బాధపడేవారికి, ఈ పథకం కింద మరణించినవారికి బీమా మొత్తాన్ని కుటుంబ సభ్యులకు అందజేస్తారు. రూ.1.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు బీమా సొమ్ము రెండు వారాల్లోగా బ్యాంక్ ఖాతాలో పడుతుంది.
తక్షణం రూ.10వేలు
దీంతోపాటు తక్షణ ఖర్చుల క్రింద రూ.10వేలు అందిస్తుంది. ఈ పథకంలో చేరేందుకు లబ్ధిదారులు సంవత్సరానికి రూ.15 ప్రీమియం చెల్లించాలి. ప్రతి లబ్ధాదారుడికి ప్రభుత్వం ఒక గుర్తింపు కార్డును అందజేస్తుంది. పాలసీ నెంబరుతోపాటు ప్రత్యేకమైన గుర్తింపు సంఖ్య ఉంటుంది. బీమా సొమ్ముకు సంబంధించి లబ్ధిదారులు ఏదైనా ఇబ్బందులను ఎదుర్కొంటుంటే బీమా నమోదుతోపాటు క్లెయిమ్ చెల్లింపులకు సంబంధించిన ఫిర్యాదు కోసం డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ను సంప్రదించవచ్చు.

రెండువారాల్లో రూ.10 లక్షలు
ఈ బీమా పథకం కింద నమోదైన వ్యక్తులు 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల్లోపు వయసులో ప్రమాదవశాత్తూ మృతిచెందడం లేదంటే శాశ్వతంగా వైకల్యం సంభవిస్తే రూ.10 లక్షల బీమా వస్తుంది. 51 సంవత్సరాల వయసు నుంచి 70 సంవత్సరాల వయసులోపు అయితే రూ.3 లక్షలు ఇస్తారు. 18 నుంచి 50 సంవత్సరాల్లోపు సహజ మరణమైతే రూ.2 లక్షలు వస్తుంది. 18 నుంచి 70 సంవత్సరాల్లోపు ప్రమాదవశాత్తూ పాక్షికంగా శాశ్వత వైకల్యం సంభవిస్తే రూ.1.5 లక్షలు వస్తుంది.
రిజిస్టర్ చేయించుకోవాలి
ప్రమాదవశాత్తూ మరణించినవారికి క్లైయిమ్ ఫామ్, మరణించినవారి ఆధార్ కార్డు, నామినీ ఆధార్ కార్డు, శవ పంచనామా, పోస్టుమార్టం రిపోర్టులు, డ్రైవింగ్ లైసెన్స్, డెత్ సర్టిఫికెట్, రేషన్ కార్డు, బ్యాంక్ పాస్ బుక్ (నామినీ), ఎఫ్ఐఆర్, కంప్లైంట్ కాపీ కావాల్సి ఉంటుంది. సహజ మరణమైతే డిశ్చార్జ్ ఫామ్, డెత్ సర్టిఫికెట్, మరణించిన వ్యక్తి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, క్లెయిమ్ ఫామ్, నామినీ బ్యాంక్ ఖాతా పుస్తకం కావాలి. నామినీలుగా లబ్ధిదారుడి భార్య, పెళ్లికాని కుమార్తె, వితంతువు కుమార్తె, 21 సంవత్సరాల కుమారుడు ఉండాలి. దరఖాస్తు చేసుకునేవారు తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు, నివాస ధ్రువీకరణ, ఆదాయ ధ్రువీకరణ, పాస్ పోర్ట్ ఫొటో, బ్యాంక్ ఖాతా, మొబైల్ నెంబరు కావాలి. మార్చి 18 నుంచి జూన్ 30 వరకు మరణించినవారిని చంద్రన్న బీమా పథకం కింద రిజిస్టర్ చేస్తున్నారు. ఇతర వివరాలకు సమీపంలోని గ్రామ, వార్డు సచివాలయాన్ని సంప్రదించాలి.












Click it and Unblock the Notifications