ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్..
ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ తెలిపింది. 2018 నుంచీ పెండింగ్‌లో ఉన్న రెండు కీలక ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం ప్రకటించింది. దీంతో అమరావతి రాజధాని నిర్మాణంలో కీలక ముందడుగు పడిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి కేంద్ర హోం వ్యవహారాల సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ అధికారికంగా వెల్లడించారు.
కేంద్రం ఆమోదం పొందిన ప్రాజెక్టుల్లో.. జనరల్ పూల్ రెసిడెన్షియల్ అకామడేషన్ (GPRA) క్వార్టర్స్ నిర్మాణం - రూ. 1,329 కోట్లు వ్యయం, కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ భవనం నిర్మాణం - రూ. 1,458 కోట్లు వ్యయం ఉన్నాయి. ఈ రెండు ప్రాజెక్టులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధికారిక ఆమోదం తెలిపారు. ఈ ఆమోదం అమరావతిని ఒక పరిపాలనా కేంద్రంగా అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయడానికి కీలకంగా నిలవనుందని కూటమి నేతలు అభిప్రాయపడుతున్నారు. డా. పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ.. రాష్ట్రం అభివృద్ధి కోసం ఇది మరో మెట్టు అని పేర్కొన్నారు.

ఈ ప్రాజెక్టులు అమలైతే అమరావతిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు స్థిర నివాస ఏర్పాటుకు ఉపయోగపడుతుంది. కామన్ సెక్రటేరియట్ భవనం ద్వారా కేంద్ర-రాష్ట్ర పరిపాలనా వ్యవస్థల సమన్వయం మెరుగవుతుందని భావిస్తున్నారు. అలానే అమరావతి నగర అభివృద్ధికి మరింత బలం చేకూరనుందని అంటున్నారు. ఈ రెండు ప్రాజెక్టుల తర్వాత కూడా, రెవెన్యూ టవర్స్, హైకోర్టు భవనం, శాసన మండలి భవనం, ఇంటిగ్రేటెడ్ ట్రాన్సిట్ హబ్, ఇంటర్నేషనల్ కాన్వెన్షన్ సెంటర్ వంటి అనేక కీలక నిర్మాణాలకు కేంద్రం నుంచి మద్దతు ఆశిస్తున్నట్లు సమాచారం.
2018లో తెలుగుదేశం ప్రభుత్వం ఈ ప్రాజెక్టులను ప్రతిపాదించినప్పటికీ.. వైసీపీ హయాంలో అమరావతి నిర్మాణం ఆగిపోయింది. అయితే ఇప్పుడు ఎన్డీయే కూటమి తిరిగి అధికారంలోకి వచ్చిన అనంతరం, అమరావతికి కొత్త ఊపును ఇస్తూ ఈ ప్రాజెక్టులు మళ్లీ పునఃప్రారంభమవుతున్నాయి.












Click it and Unblock the Notifications