ఏపీ ప్రభుత్వ శుభవార్త.. రైతులకు రూ.2లక్షలు వడ్డీలేని రుణాలు!
ఏపీ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తుంది. ఇప్పటికే అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు పంట పెట్టుబడిని అందిస్తున్న ప్రభుత్వం, పంట పండించిన తర్వాత రైతులకు గిట్టుబాటు ధర వచ్చేవరకు పంటను మార్కెట్ యార్డ్ గోదాములలో నిలువ చేసేందుకు సదుపాయాన్ని కూడా కల్పిస్తోంది. రైతుల అవసరాలకు ఆ పంట పైన వడ్డీ లేని రుణాలను అందిస్తోంది.
రైతుల కోసం రైతు బంధు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని చెబుతున్న ఏపీ ప్రభుత్వం రైతుబంధు పథకం ద్వారా పండించిన పంటలకు ఆర్థిక భరోసాను అందిస్తోంది.
గతంలో కొనసాగిన రైతుబంధు పథకాన్ని మళ్లీ ఏపీ ప్రభుత్వం తిరిగి ప్రారంభించింది. రాష్ట్రంలో అనేక జిల్లాలలో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ప్రస్తుత ఖరీఫ్ లో పంట దిగుబడి సమయానికి రైతులకు ఈ పథకం అందుబాటులోకి వస్తుంది.

గోడౌన్ లో నిల్వ చేసిన పంట ఉత్పత్తులపై 75 శాతం రుణాలు
మార్కెట్ కమిటీల ఆధ్వర్యంలో ఈ పథకాన్ని రైతులకు అందించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం కింద రైతులు తమ ధాన్యాన్ని మార్కెటింగ్ శాఖ పరిధిలోని గోడౌన్స్ లో ఆరు నెలల పాటు ఉచితంగా నిల్వ చేసుకోవచ్చు. గోడౌన్లో నిల్వచేసిన పంట మార్కెట్ విలువలో 75 శాతం వరకు ప్రభుత్వ రైతులకు రుణాలను ఇవ్వడానికి అవకాశం ఉంది.
పంట రుణాలకు వడ్డీ లేదు .. కానీ
ఆరు నెలల కాలంలో కూడా వీరికి మద్దతు ధర రాకపోతే, పంటను గోదాములలోనే ఉంచాల్సి వస్తే తక్కువ అద్దె చెల్లించాల్సి ఉంటుంది. ఇక గోదాములలో నిలువ చేసిన వ్యవసాయ ఉత్పత్తులకు భీమా సౌకర్యం కూడా కల్పించబడుతుంది. అయితే ఈ పంట పైన తీసుకున్న రుణాలకు 180 రోజుల వరకు వడ్డీ చెల్లించవలసిన అవసరం లేదు. ఆపై 181 రోజు నుంచి 270 రోజుల వరకు 12 శాతం వడ్డీ చెల్లించవలసి ఉంటుంది.
రైతులకు రెండు లక్షల వరకు రుణాలు
అంటే ఒక రూపాయి చొప్పున వడ్డీ చెల్లించాలి. ఒకప్పుడు 50వేల రూపాయలు గా ఉండేది. ప్రస్తుతం ఈ రుణాన్ని రెండు లక్షల రూపాయలకు పెంచారు. రైతులు తమ పంట ఉత్పత్తులను మద్దతు ధర లేకుంటే విక్రయించకుండా ఆర్థిక భరోసాని కల్పించి, కొంతకాలం పాటు వారికి అండగా ఉండడానికి నిర్ణయించిన పథకమే రైతు బంధు పథకం.
పంట దిగుబడిపై తమ పరిధిలోనే లబ్ధికి అవకాశం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులు ఏపీ ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకం గురించి మరిన్ని వివరాల కోసం తమ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శులను సంప్రదించవచ్చు. పంట దిగుబడి వచ్చిన తర్వాత తమ పరిధిలోనే ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలని అధికారులు కోరుతున్నారు.












Click it and Unblock the Notifications