శ్రీవారి భక్తులకు గాల్లో తేలిపోయే వార్త.. గంటలోనే తిరుపతికి ప్రయాణం!
తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రతిరోజు పెద్ద సంఖ్యలో భక్తులు వెళుతూ ఉంటారు. రైళ్లు, బస్సులు, ప్రైవేట్ వాహనాల ద్వారా వెళ్లి శ్రీవారిని దర్శనం చేసుకుంటారు. అయితే విమానాలలో ప్రయాణం చేసేవారు చాలా తక్కువ. కానీ ఇకపై తిరుమల శ్రీవారిని దర్శించుకోవటానికి వెళ్లాలని భావించేవారు హైదరాబాద్ నుండి నేరుగా తిరుపతికి విమానంలో వెళ్ళవచ్చు.
ప్రతీరోజూ తిరుపతికి డైరెక్ట్ విమాన సర్వీసులను ప్రారంభించనున్న ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్
ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ప్రతీరోజూ తిరుపతికి డైరెక్ట్ విమాన సర్వీసులను ప్రారంభించనుంది. సెప్టెంబర్ ఒకటవ తేదీ నుండి హైదరాబాద్ తిరుపతి మధ్య ప్రతిరోజు డైరెక్ట్ విమాన సర్వీసులను ప్రారంభిస్తోంది. శంషాబాద్ విమానాశ్రయం నుండి బయలుదేరే ఈ విమానాలు ప్రయాణికులకు సమయం ఆదా చేయటం మాత్రమే కాదు, సౌకర్యవంతంగా కూడా అన్పిస్తాయి.

గంటలోనే హైదరాబాద్ నుండి తిరుపతికి
హైదరాబాద్ నుండి తిరుపతికి ప్రతిరోజూ మధ్యాహ్నం 1.30గంటలకు బయలుదేరి, మధ్యాహ్నం 2.40కి తిరుపతి చేరుకుంటుంది. మళ్ళీ తిరుపతిలో 3.25 నిముషాలకు బయలుదేరి , సాయంత్రం 4.30కి తిరిగి హైదరాబాద్ చేరుకుంటుంది. ఈ నాన్ స్టాప్ సర్వీస్ కారణంగా ప్రయాణం కేవలం ఒక గంట వ్యవధిలోనే పూర్తవుతుంది. ఇది తిరుమలభక్తులకు, వ్యాపారులకు, పర్యాటకులకు చాలా ఉపయుక్తంగా ఉంటుంది.
తిరుమలకు వెళ్ళే ఫ్లైట్ లకు డిమాండ్ తో కొత్త సర్వీసులు.. టికెట్ ధరలు తగ్గే ఛాన్స్
ఇప్పటికే తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లాలనుకునే వారికి హైదరాబాద్ నుండి తిరుపతికి ప్రస్తుతం రోజుకు ఎనిమిది విమాన సర్వీసులు ఉన్నాయి. అయితే తిరుమల దర్శనం టికెట్ల కోసం డిమాండ్ పెరగడంతో టికెట్ ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. గంట ప్రయాణానికి 5,700రూపాయల నుండి ఒక్కోసారి రూ.24000 వరకూ టికెట్ ధరలు ఉంటున్నాయి. ప్రస్తుతం కొత్తగా డైరెక్ట్ సర్వీస్ లు అందుబాటులోకి రానున్న క్రమంలో ధరలు కాస్త తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ మధ్యాహ్నం సర్వీసులతో భక్తులకు బెనిఫిట్
ఇదిలా ఉంటే తిరుపతి ఎయిర్పోర్ట్ లో టీటీడీ ప్రతిరోజు శ్రీవాణి దర్శనం టికెట్లను జారీ చేస్తుంది. దీని కారణంగా చాలా మంది భక్తులు ఉదయం నుండి హైదరాబాద్ నుండి బయలుదేరి తిరుపతికి చేరుకుంటున్నారు . మధ్యాహ్నం వేళ ఎక్కువ ఫ్లైట్ లు లేకపోవడంతో, ప్రస్తుతం ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ మధ్యాహ్నం సర్వీస్ అందించటం భక్తులకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఏది ఏమైనా తిరుమలకు వెళ్లే శ్రీవారి భక్తులకు మాత్రం ఇది గాల్లో తేలిపోయే వార్త.




Click it and Unblock the Notifications