టీచర్‌ను ఇంటికి పిలిచి కొట్టారు- చిక్కుల్లో కొలికపూడి..!!
ఎమ్మెల్యే కొలికపూడి మరో వివాదంలో చిక్కుకున్నారు. కొద్ది నెలల క్రితం వరుస వివాదాలతో టీడీపీ క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరైన కొలికపూడి ఆ తరువాత వివాదాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా కొలికపూడి ఒక టీచర్ ను ఇంటికి పిలిచి కొట్టారని ప్రభుత్వంలోని నామినేటెడ్ పోస్టులో ఉన్న నేత టీడీపీ అధ్యక్షుడికి ఫిర్యాదు చేసారు. చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీని పైన కొలికపూడి వాదన భిన్నంగా ఉంది. దీంతో.. ఇప్పుడు కొలికపూడి ఎలాంటి చర్యలు ఉంటాయి అనేది కీలకంగా మారుతోంది.
రాష్ట్రంలో ఉపాధ్యాయుల చుట్టూ రాజకీయం కొనసాగుతున్న వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి చుట్టూ మరో వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే కొలికపూడి.. పీఈటీ టీచర్‌ను ఇంటికి పిలిపించి దుర్భాషలాడడంతో పాటు కర్రతో కొట్టినట్టు పేర్కొన్నారు. ఈ మేరకు పీఈటీ మేరుగు రమేశ్ ఆరోపణలను బాలకోటయ్య ఉటంకించారు.

ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. 'విస్సన్నపేట మండలం నరసాపురం జెడ్పీహెచ్ స్కూల్‌లో పీఈటీగా పనిచేస్తున్న మేరుగు రమేశ్‌ను ఈ నెల 25వ తేదీ సాయంత్రం 6.30 గంటలకు డిప్యూటీ డీఈవో ద్వారా ఎమ్మెల్యే ఇంటికి పిలిపించారని వివరించారు. అదే సమయంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శోభలతను కూడా పిలిపించి దుర్భాషలాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
చర్యలు తీసుకోవాలని డిమాండ్
పాఠశాలలో నిర్వహించిన ఆటల పోటీలకు ఎమ్మెల్యేను ముఖ్య అతిథిగా ఆహ్వానించకుండా గ్రామానికి చెందిన టీడీపీ నేత గోటేటి సుబ్రహ్మణ్యంను ఆహ్వానించడమే ఈ ఘటనకు కారణం. ఎమ్మెల్యేపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు బాధితులు భయపడుతున్నారని బాలకోటయ్య పేర్కొన్నారు. ఎమ్మెల్యే వ్యవహారశైలిపై గతంలోనూ ఫిర్యాదులు రావడాన్ని లేఖలో ప్రస్తావించారు. అయితే, ఈ ఆరోపణలను కొలికపూడి ఖండిస్తున్నారు. గతంలోనూ కొలికపూడి పార్టీ వ్యవహారాల్లో వివాదాల్లో చిక్కుకున్నారు.
ఎంపీ కేశినేని చిన్ని తో ఏర్పడిన విభేదాలు.. చోటు చేసుకున్న పరిణామాల పైన పార్టీలో వివాదం చోటు చేసుకుంది. దీంతో, సీఎం చంద్రబాబు ఆదేశాలతో పార్టీ క్రమశిక్షణా సంఘం ముందు హాజరయ్యారు. వివరణ ఇచ్చారు. ఆ తరువాత వివాదాలకు దూరం గా ఉంటానని చెప్పుకొచ్చారు. ఇక, తన పని తాను చేసుకుంటానని హామీ ఇచ్చారు. ఇక.. ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకోవటం తో కొలికపూడి పై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది కీలకంగా మారుతోంది.













Click it and Unblock the Notifications
