ఉద్యోగార్ధులకు జగన్ గుడ్ న్యూస్- వర్శిటీలు, ట్రిపుల్ ఐటీల్లో 3295 పోస్టుల భర్తీ...
ఏపీలో ఎన్నికల వేళ నిరుద్యోగులకు సీఎం వైఎస్ జగన్ మరో గుడ్ న్యూస్ చెప్పారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిపిన రిక్రూట్ మెంట్లలో భర్తీ కాని, పెండింగ్ లో ఉన్న 3295 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రిక్రూట్ మెంట్ నిర్వహించేలా జగన్ ఇవాళ ఆదేశాలు ఇచ్చారు. దీంతో నిరుద్యోగులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది.
విశ్వవిద్యాలయాలు, ట్రిపుల్ ఐటీలలో అధ్యాపకుల నియామకాలపై ఇవాళ క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్.జగన్ సమీక్ష నిర్వహించారు. ఇందులో యూనివర్సిటీలు, ట్రిపుల్ ఐటీల్లో భారీ రిక్రూట్‌మెంట్‌కు సీఎం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. 3295 పోస్టుల భర్తీకి సీఎం ఆమోదం తెలిపారు. నవంబరు 15 నాటికి నియామక ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా పోస్టుల భర్తీ ఉంటుంది. పూర్తి ఆన్‌లైన్‌లో విధానంలో పరీక్షలు నిర్వహిస్తారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని యూనివర్సిటీలలో పూర్తి స్ధాయి రెగ్యులర్ సిబ్బంది నియామకానికి ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి జగన్.. యూనివర్సిటీల్లో 2635 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లుతో పాటు, ట్రిపుల్ ఐటీల్లో 660 పోస్టుల భర్తీకి ఆదేశించారు. ఇప్పటికే వైద్యఆరోగ్యశాఖలో దాదాపు 51వేల పోస్టుల భర్తీ చేసిన ప్రభుత్వం.. ఉన్నత విద్యాశాఖలో అత్యున్నత ప్రమాణాల కల్పనలో భాగంగా ఇప్పటికే ప్రపంచస్ధాయి కరిక్యులమ్ ఏర్పాటు దిశగా సన్నాహాలు చేస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాల్లో మొత్తం ఖాళీలు భర్తీ చేయాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశించారు. ఇప్పటికే వైద్య ఆరోగ్యశాఖలో 51వేల పోస్టుల భర్తీ చేశామని, విశ్వవిద్యాలయాల్లో కూడా పూర్తి స్ధాయిలో ఖాళీలను భర్తీ చేయాల్సిందేనని తెలిపారు. యూనివర్సిటీలలో ఉత్తమ ఫలితాలు సాధించాలంటే... పూర్తి స్ధాయిలో రెగ్యులర్ పోస్టుల భర్తీ చేయాల్సిందేనని స్పష్టం చేశారు. యూనివర్సిటీల్లో మొత్తం 2635 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయడానికి సీఎం ఆమోదం తెలిపారు. అదే విధంగా ట్రిపుల్ ఐటీలలో మరో 660 (లెక్చరర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లు) పోస్టుల భర్తీకి ఆదేశించారు.
నిర్దేశించిన ప్రమాణాలతో అభ్యర్ధులు కచ్చితంగా క్వాలిఫై కావాలని జగన్ ఆదేశించారు. నూటికి నూరుశాతం మెరిట్ ఉండాలన్నారు. అదే విధంగా ఇప్పటికే కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్న వారికి సంవత్సరానికి 1 మార్కు చొప్పున గరిష్టంగా 10 మార్కులు వెయిటేజ్ ఇవ్వాలని అధికారులు ప్రతిపాదించగా... ఇంటర్వ్యూ టైంలో ఈ వెయిటేజ్ ఇవ్వాలని నిర్ణయించారు.
పిల్లలు యూనివర్సిటీల నుంచి క్వాలిటీ ఎడ్యుకేషన్‌తో బయటకు రావాలంటే బోధనా సిబ్బంది నియామకాలు, అర్హత ప్రమాణాలు కచ్చితంగా నాణ్యతగా ఉండాలని జగన్ సూచించారు.
విశ్వవిద్యాలయాల్లో పోస్టుల భర్తీకి సంబంధించిన షెడ్యూల్ కూడా సీఎం జగన్ కు అధికారులు ఇచ్చారు. దీని ప్రకారం23 ఆగస్టున యూనివర్సిటీల్లో 3295 అధ్యాపక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తారు. సెప్టెంబరు 3,4 వారాల్లో ఏపీపీఎస్సీ పరీక్షలు నిర్వహించనుంది. ఆన్‌లైన్‌లో పరీక్షలు ఉంటాయి. 10 అక్టోబరు కల్లా పరీక్షా ఫలితాలు విడుదల చేస్తారు. రిటన్ టెస్ట్ ఫలితాలు విడుదల అనంతరం నెల రోజుల్లో ఇంటర్వ్యూలు నిర్వహణకు నిర్ణయించారు. నవంబరు 15 నాటికి ఇంటర్వ్యూల సహా నియామక ప్రక్రియ పూర్తి చేస్తారు. అదే రోజు అన్ని ఎంపికైన అభ్యర్ధుల జాబితాను డిస్‌ప్లే చేస్తారు.












Click it and Unblock the Notifications