మంత్రి పదవి ఆశించా కానీ .. గోరంట్ల బుచ్చయ్య చౌదరి షాకింగ్ కామెంట్స్
రాష్ట్ర రాజకీయాల్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి సీనియర్ నాయకుడు. 1983 నుంచి వరుస ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధిస్తున్న ఆయనకు మంత్రి పదవి తీరని కలగానే మిగిలిపోయింది. 2019 ఎన్నికల్లో జగన్ ప్రభంజనాన్ని కూడా తట్టుకుని మరీ ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేసిన ఆయన 50 వేలకు పైగానే మెజార్టీతో విజయం సాధించారు. దీంతో గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఈసారి కేబినెట్ లో తనకు ఖచ్చితంగా స్థానం దొరుకుతుందని ఆశించారు.
కానీ ఆయన అనుకున్నది జరగలేదు. పార్టీని నమ్మకమైన నేతగా పేరున్న గోరంట్ల బుచ్చయ్యచౌదరిని ఈసారి కూడా పక్కన పెట్టారు. ఆయన తనకు ఇదే చివరి ఎన్నిక అని పదే పదే ఎన్నికల ప్రచారంలో చెబుతూ వచ్చారు. అయినప్పటికి చంద్రబాబు తన మంత్రివర్గంలో బుచ్చయ్య చౌదరికి చోటు కల్పించలేదు. మంత్రి పదవి రాకపోవడంపై తాజాగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నలభై ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా.. ఏ పదవి లేకున్నా ప్రజాసేవ చేశానని తెలిపారు.

పొత్తులతో కలిసి చేసిన తరుణంలో ఎన్నో లెక్కలు ఉంటాయని అని ఆయన చెప్పుకొచ్చారు. అయితే తాను మంత్రి పదవి ఆశించానని..ఇవ్వడం, ఇవ్వకపోవడం వాళ్ల ఇష్టమన్నారు. మంత్రి పదవి రానందుకు తనకు ఏమి బాధ లేదని అన్నారు. స్పీకర్ పోస్ట్ ఇస్తారా..? ఇంకేదైనా ఇస్తారా..? అన్నది అధిష్టానం ఇష్టమని ఆయన స్పష్టం చేశారు. బుచ్చయ్య చౌదరికి ఈసారి స్పీకర్ పదవి దక్కే అవకాశాలున్నాయని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications