జగన్‌కు లైనే లేదు, హైద్రాబాద్‌లో ఉండి ట్యాపింగ్ చేయించుకునేబదులు: లోకేష్ సంచలనం
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ మంగళవారం నాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి విమర్శల పైన, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాలన పైన లోకేష్ స్పందించారు.
అలాగే పెట్టుబడులకు ఏపీ నెంబర్ 2 రాష్ట్రంగా ప్రపంచ బ్యాంక్ ప్రకటించడం పైన ఆయన స్పందించారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు విధానాల వల్లనే దేశంలో ఏపీ పెట్టుబడుల విషయంలో రెండో స్థానంలో నిలిచిందని ప్రశంసించారు. త్వరలో ఏపీ మొదటి స్థానంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

పరిశ్రమలకు ఏపీ అనుకూల రాష్ట్రంగా నిలవడంతో ఏపీకి మరిన్ని పెట్టుబడులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. వైయస్ జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు ప్రభుత్వాన్ని విమర్శించేందుకు లైన్ కూడా దొరకడం లేదని ఎద్దేవా చేశారు.
అలాగే, తెలంగాణ అంశంపై స్పందిస్తూ... హైదరాబాదులో ఉండి ఫోన్ ట్యాపింగ్ చేయించుకోవడం కంటే సొంత రాష్ట్రం నుంచి పాలన సాగించడం మేలు అన్నారు. తెలంగాణలో కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రజా వ్యతిరేక పాలన పైన తెలంగాణ తెలుగుదేశం పార్టీ పోరాడుతుందని నారా లోకేష్ స్పష్టం చేశారు. ఇటీవల ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కలకలం రేపిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications