చంద్రబాబుకు రిలీఫ్: ఎట్టకేలకు గవర్నర్ ఆమోదించారు : అయినా..పెండింగ్‌లోనే...!
వరుస పంచాయితీలతో సతమతం అవుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు కొంత రిలీఫ్ దొరికింది. ముఖ్యమంత్రి ఎంపిక చేసిన సమాచార హక్కు చట్టం కమిషనర్ల నియామకానికి గవర్నర్ ఇప్పటి వరకు బ్రేక్ వేసారు. ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన పేర్ల పైన గవర్నర్ సందేహాలు వ్యక్తం చేసారు. అయితే, ప్రభుత్వం నుండి వివరణ వచ్చిన తరువాత అందులో ఒక పేరుకు గవర్నర్ ఆమోద ముద్ర వేసింది. ఇదే సమయంలో...మరో పేరు విషయంలో మాత్రం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు..
ఆ పేరుకు గవర్నర్ ఆమోదం...
కొద్ది రోజులుగా గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్న సమాచార హక్కు కమిషనర్ల నియామకం పైన కీలక నిర్ణయం జరిగింది. కొద్ది రోజుల క్రితం ఏపీ ప్రభుత్వం సమాచార హక్కు కమిషనర్లుగా ఇద్దరి పేర్లను ప్రతిపాదించింది. ఆ పేర్లను గవర్నర్ ఆమోదానికి పంపింది. అందులో విజయవాడ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న ఐలాపురం రాజా పేరుతో పాటుగా రెవిన్యూ సర్వీసులో స్వచ్చంద పదవీ విరమణ చేసిన ఐ శ్రీరామమూర్తి పేర్లను ప్రతిపాదించారు.

ఈ పేర్లను ఆమోదించకుండా గవర్నర్ పెండింగ్‌లో పెట్టారు. ఆర్టీఐ కమిషనర్లుగా నియమించాలంటే కావాల్సిన అర్హతల గురించి గవర్నర్ ఆరా తీసారు. ఈ ఇద్దరి పేర్లను ఎంపిక చేయటం వెనుక వారికి ఉన్న నేపథ్యం గురించి సమాచారం ఇవ్వాలని కోరారు. తొలుత ఆ రెండు పేర్లను ఆమోదించని గవర్నర్..ప్రభుత్వ ఇచ్చిన వివరణ మేరకు ఆ రెండు పేర్లలో ఐలాపురం రాజా పేరుకు గవర్నర్ ఆమోద ముద్ర వేసారు.
రెండో పేరు పెండింగ్...
ప్రభుత్వం ప్రతిపాదించిన ఇద్దరూ సమాచార హక్కు కమిషనర్లకు గవర్నర్ ఒక పేరుకే ఆమొద ముద్ర వేయటంతో ఇప్పుడు రెండో పేరు గురించి ఉత్కంఠ మొదలైంది. ప్రభుత్వం సామాజిక సేవ అంశం కింద శ్రీరామమూర్తి పేరును కూడా ఇదే ఫైల్‌లో పంపినా.. ఆయన చేసిన సామాజిక సేవ ఏంటో చెప్పాలని గవర్నర్ అడిగినట్లు సమాచారం. గతంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ ఇదే రకంగా ముఖ్యమంత్రి..పంపిన సమాచార హక్కు కమిషనర్లుగా నలుగురి పేర్ల పైనా గవర్నర్ అప్పట్లో అభ్యంతరం వ్యక్తం చేసారు.

అయితే, ముఖ్యమంత్రి స్వయంగా వెళ్లి గవర్నర్‌కు వారి గురించి వివరణ ఇచ్చారు. ఆ తరువాత గవర్నర్ ఆపేర్లకు ఆమోద ముద్ర వేసారు. ఇక, ఇప్పుడు తిరిగి చంద్రబాబు ప్రభుత్వం చేసిన సిఫార్సులపైనా గవర్నర్ బ్రేకులు వేయటం చర్చకు కారణమైంది. ఇక, ఆ రెండో పేరు ఆమోదం కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయో చూడాలి.












Click it and Unblock the Notifications