ఓటుకు నోటు కేసు: మీరే చక్కదిద్దాలంటూ గవర్నర్‌కు రాజ్‌నాథ్...?
అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై గవర్నర్ నరహింహాన్, కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ని బుధవారం సాయంత్రం కలిసి ఒక నివేదికను సమర్పించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, గవర్నర్‌కు కొన్ని సూచనలు చేసినట్లు తెలుస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పరిస్ధితులు కేంద్రం వరకూ రాకుండా హైదరాబాద్‌లోనే చక్కదిద్దాలని గవర్నర్‌కు స్పష్టం చేసినట్లు సమాచారం. ఓటుకు నోటు వ్యవహారంలో తన బాధ్యత లేదని, ఏసీబీ తన పరిధిలోనే పని చేసిందని గవర్నర్ నరసింహన్ హోంమంత్రికి వివరించినట్లు తెలిసింది.
గత ఏడాదిగా శాంతి భద్రతల పరిస్థితి సజావుగా ఉందని, అందువల్ల తన అధికారాలను ఉపయోగించాల్సిన అవసరం రాలేదని ఆయన చెప్పారని తెలుస్తోంది. ముందుగా రాజ్‌నాథ్‌తో చంద్రబాబు సమావేశం కావాల్సి ఉన్నప్పటికీ, ఆలస్యం అవడంతో గవర్నర్‌తో సమావేశమయ్యారు.

ఓటుకు నోటు వ్యవహారం గురించి గవర్నర్ మాట్లడుతుండగా మధ్యలోనే ఏపీ సీఎం చంద్రబాబు రాజ్‌నాథ్ ఆఫీసుకి రావడంతో గవర్నర్‌తో భేటీని అర్థాంతరంగా ముగించి, బాబుతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడి వెళ్లిన తర్వాత మళ్లీ గవర్నర్ వచ్చారు.
రెండోసారి రాజ్‌నాథ్ ‘మిగతా వివరాలను, మీ అభిప్రాయాలను హోం సెక్రటరీకి వివరించండి' అని చెప్పినట్లు సమాచారం. రాజ్‌నాథ్‌తో సమావేశం అనంతరం గవర్నర్ నరసింహాన్ మీడియాతో మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలు, సమస్యలు పరిష్కారం కావాలని ఆశిస్తున్నట్లు గవర్నర్ పేర్కొన్నారు.
‘‘ఫోన్ ట్యాపింగ్‌పై, రెండు రాష్ట్రాల్లో శాంతిభద్రతలపై నేను ఎలాంటి నివేదిక ఇవ్వలేదు. విభజనకు ఏడాది పూర్తయిన నేపథ్యంలో చోటుచేసుకున్న పరిణామాలపై వివరించేందుకే వచ్చాను'' అన్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి రాజధానిలో గవర్నర్ అధికారాలు, సెక్షన్ 8పై హోంశాఖ కార్యదర్శి గోయల్ మీ వైఖరి తెలుసుకున్నారా? అన్న ప్రశ్నకు ఈ అంశంపై చర్చించ లేదని చెప్పారు.












Click it and Unblock the Notifications