నరసింహన్ ఢిల్లీ పర్యటన ఆంతర్యమేమిటి?: జైల్లో రేవంత్ ఇఫ్తార్ విందు
హైదరాబాద్: గవర్నర్ నరసింహన్ ఢిల్లీ పర్యటన అందరిలోను ఉత్కంఠను రేపింది. గవర్నర్ నరసింహన్ కేంద్ర హోంశాఖ అధికారులను, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తదితరులను ఒకటికి రెండుసార్లు కలిశారు. సెక్షన్ 8, ఫోన్ ట్యాపింగ్, ఓటుకు నోటు తదితర అంశాలు చర్చకు వచ్చాయని తెలుస్తోంది.
అయితే, గవర్నర్ మాత్రం ఇది సాధారణ పర్యటనేనని చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ పరిస్థితులు, గవర్నర్ నరసింహన్‌ను కేంద్రం అత్యవసరంగా పిలిపించడం వెనుక ఏముందో ఎవరికీ అంతు చిక్కడం లేదనే చెప్పవచ్చు.
గవర్నర్ గురువారం సాయంత్రం ఢిల్లీ వెళ్లిన తర్వాత కేంద్రమంత్రి, టీడీపీ నేత సుజనా చౌదరితో భేటీ అయ్యారు. మరోవైపు, హైదరాబాద్ నుండి ఢిల్లీకి వెళ్లే విమానంలో యాదృచ్ఛికంగా టీఆర్ఎస్ ఎంపీ వినోద్ ఉన్నారు. ఇవన్నీ చర్చనీయాంశమయ్యాయి.

గవర్నర్ నరసింహన్ మనస్తాపానికి గురయ్యారని, రాజీనామా చేయవచ్చునని, ఆయన స్థానంలో నజ్మాహెప్థుల్లా వస్తారనే ఊహాగానాలు కూడా వినిపించాయి. అయితే, ఢిల్లీ వెళ్లిన గవర్నర్ ఎప్పటిలా ప్రశాంతంగానే ఉన్నారు. అయితే, బిజీబిజీగా గడిపారు. గవర్నర్ ఢిల్లీ పర్యటన ఆంతర్యంపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
చర్లపల్లి జైలులో రేవంత్ ఇఫ్తార్ విందు
ఓటుకు నోటు కేసులో నిందితుడు రేవంత్ రెడ్డి చర్లపల్లి జైలులో ఖైదీలకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. శుక్రవారం నాడు బెయిల్ పిటిషన్ పైన హైకోర్టులో వాదనలు జరిగాయి. అనంతరం ఆయన బెయిల్ పిటిషన్ పైన తీర్పు మంగళవారానికి వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఆయన ఇఫ్తార్ విందు ఇవ్వడం గమనార్హం.












Click it and Unblock the Notifications