స్వచ్ఛ భారత్‌లో గవర్నర్: సెలబ్రిటీలు రావాలన్న కెసిఆర్
హైదరాబాద్: రాజ్‌భవన్ కాలనీలో గవర్నర్ నర్సింహన్ ‘స్వచ్ఛ భారత్' కార్యక్రమాన్ని గురువారం ఉదయం ప్రారంభించారు. రాజ్‌భవన్ ఉద్యోగులతో కలిసి గవర్నర్ దంపతులు రోడ్లు ఊడ్చారు. ఈ సందర్భంగా గవర్నర్ ‘స్వచ్ఛ భారత్' ప్రతిజ్ఞ చేయించారు. ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మిద్దామని గవర్నర్ నర్సింహన్ పిలుపునిచ్చారు.
క్లీన్ అండ్ గ్రీన్ హైదరాబాద్ లక్ష్యంగా పని చేయాలని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటిని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు. ఇది ఒక్క రోజుతో ముగిసే కార్యక్రమం కాదని అన్నారు. రాజకీయాలకు అతీతంగా స్వచ్ఛ భారత్‌లో అందరూ పాల్గొనాలని, సెలబ్రిటీలు కూడా ముందుకు రావాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు. ఆయన ఈ సందర్భంగా ప్రజలకు సద్దుల బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.
గాంధీకి నివాళి

మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద పలువురు ప్రముఖులు గురువారం ఉదయం నివాళులర్పించారు. గవర్నర్ నర్సింహన్, ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, ఎంపీలు దత్తాత్రేయ, వి హనుమంతరావు, టిపిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తదితరులు బాపూఘాట్ వద్ద నివాళులర్పించారు.
అనంతరం తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద సిఎం కెసిఆర్, స్పీకర్ మధుసూదనాచారి, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, మండలి డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్ రావు, మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, తదితరులు నివాళులర్పించారు.












Click it and Unblock the Notifications