ఏపీలో మళ్లీ కరోనా కలకలం- 24 గంటల్లో 210 కేసులు- 85 కేసులతో చిత్తూరు టాప్
ఏపీలో మళ్లీ కరోనా కలకలం రేపుతోంది. పలు జిల్లాల్లో కొత్త కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా ఇంకా కేసులు నమోదవుతుండటం అధికారుల్ని సైతం కలవరపెడుతోంది. నెల రోజుల క్రితం రోజుకి కేవలం 50 కేసులు నమోదు కాగా.. ఇప్పుడు ఆ సంఖ్య 200 దాటిపోయింది. దీంతో ప్రభుత్వం అప్రమత్తమవుతోంది.
ఏపీలో కరోనా మరోసారి ప్రభావం చూపుతోంది. గతేడాది ఇదే సమయానికి వందల కేసులతో కల్లోలం రేపిన కరోనా ఇప్పుడు మరోసారి ఆ స్ధాయిలో కాకపోయినా పలు చోట్ల ఓ మోస్తరు ప్రభావం చూపుతోంది. అయితే రోజురోజుకీ కేసుల సంఖ్య పెరుగుతుండటం అధికారుల్ని కలవరానికి గురిచేస్తోంది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలిపి 210 కేసులు నమోదయ్యాయి. ఇందులో ఒక్క చిత్తూరు జిల్లాలోనే 85 కేసులు నమోదు కావడం విశేషం.

కొత్త కరోనా కేసుల జాబితాలో చిత్తూరు తర్వాత స్ధానంలో తూర్పుగోదావరి జిల్లా 41 కేసులతో అగ్రస్ధానంలో ఉంది. ఆ తర్వాత గుంటూరు 18, విశాఖపట్నం 16, కృష్ణా జిల్లా 14, అనంతపురం 12 కేసులు నమోదయ్యాయి. అయితే విజయనగరం (1), పశ్చిమగోదావరి (2), కడప (3), నెల్లూరు (3), ప్రకాశం (3), కర్నూలు (4), శ్రీకాకుళం (8) కేసులతో సింగిల్ డిజిట్ మాత్రమే నమోదు చేయడం ఊరటనిస్తోంది. మృతుల విషయానికొస్తే కృష్ణాజిల్లాలో గత 24 గంటల్లో కోవిడ్ కారణంగా ఒకరు చనిపోయారు. అయితే 140 మంది కోవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. గత 24 గంటల్లో రాష్ట్రంలో 44709 కోవిడ్ పరీక్షలు నిర్వహించారు.












Click it and Unblock the Notifications