ఎమ్మెల్యే చింతమనేనికి ఊరట, భీమడోలు కోర్టు శిక్షను సస్పెండ్ చేసిన హైకోర్టు!
దెందులూరు: పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు చింతమనేని ప్రభాకర్‌కు గొప్ప ఊరట లభించింది. మాజీ మంత్రిపై చేయి చేసుకున్న కేసులో భీమడోలు న్యాయస్థానం ఆయనకు విధించిన ఆర్నెల్ల జైలు శిక్షను శుక్రవారం హైకోర్టు సస్పెండ్ చేసింది.
2011లో అప్పటి మంత్రి వసంత్‌కుమార్‌పై చింతమనేని ప్రభాకర్ చేయి చేసుకున్నట్టుగా ఆరోపణలున్నాయి. అదే సమయంలో ఎంపీ కావూరి సాంబశివరావు పైన కూడా దౌర్జన్యం చేశారన్న ఆరోపణలున్నాయి.
మంత్రి వసంత్ కుమార్ ఫిర్యాదు మేరకు ఈ వ్యవహారంపై విచారణ జరుపుతూ వచ్చిన భోమడోలు మెజిస్ట్రేట్.. ఇటీవల చింతమనేని దోషిగా ప్రకటించారు. ఆయనకు ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.5 వేలు జరిమానా విధించారు. అనంతరం ఇద్దరు వ్యక్తిగత పూచీకత్తుపై ఆయనకు బెయిల్ లభించింది.

మరోవైపు భీమడోలు న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ హైకోర్టులో అప్పీలు చేశారు. గురువారం హైకోర్టులో ఈ కేసు విచారణకు రాగా, జస్టిస్ షమీమ్ అక్తర్ శుక్రవారానికి వాయిదా వేశారు. శుక్రవారం ఈ కేసులో వాదనలు నడిచాయి.
కింది కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వకపోతే తనకు ఎమ్మెల్యేగా కొనసాగే అవకాశం ఉండదని ఎమ్మెల్యే ప్రభాకర్ తన పిటిషన్‌లో న్యాయమూర్తిని కోరారు. నిబంధనల ప్రకారం పదవిలో ఉన్న ప్రజాప్రతినిధికి ఏదైనా కేసులో రెండేళ్లకు తక్కువ కాకుండా జైలుశిక్ష పడినట్లయితే పదవి వూడటమేకాక, ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కూడా కోల్పోతారు.
కేవలం ఇద్దరు సాక్షులు ఇచ్చిన వాంగ్మూలంపై ఆధారపడి కింది కోర్టు చింతమనేనికి శిక్ష విధించిందని, నిజానికి కింది కోర్టు శిక్ష విధించిన ఐపీసీ సెక్షన్ 506 పార్ట్ 2 ఈ కేసుకు సంబంధించనది అని పేర్కొనడంతో హైకోర్టు న్యాయమూర్తి.. భీమడోలు న్యాయస్థానం విధించిన ఆర్నెల్ల శిక్షను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.












Click it and Unblock the Notifications