చంద్రబాబుతో పవన్ పొత్తు చిచ్చు-గుడివాడ అమర్నాథ్ వర్సెస్ హరిరామజోగయ్య - ఘాటు లేఖలు..!
ఏపీలో టీడీపీ-జనసేన పొత్తు కోసం పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రయత్నాలపై కాపు నేత హరిరామజోగయ్యకూ, మంత్రి గుడివాడ అమర్నాథ్ కు మధ్య లేఖలతో చిన్నసైజు యుద్ధమే నడుస్తోంది.
ఏపీలో టీడీపీ-జనసేన మధ్య పొత్తు వ్యవహారం కీలక స్ధానంలో ఓ ఇద్దరు కాపు నేతల మధ్య వార్ కు కారణమవుతోంది. ఇందులో ఒకరు వైసీపీ ప్రభుత్వం మంత్రి కాగా.. మరొకరు పవన్ కళ్యాణ్ ను సీఎంగా చూడాలనుకుంటున్న కీలక కాపు నేత. వీరిద్దరూ పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడానికి అనుకూలంగా, వ్యతిరేకంగా లేఖల యుద్ధం సాగిస్తున్నారు. ఇందులో పలు పాత విషయాలు కూడా తెరపైకి వస్తున్నాయి.

టీడీపీ-జనసేన పొత్తు
ఏపీలో ఈసారి జరగబోయే సార్వత్రిక ఎన్నికల సమీకరణాలను మారుస్తుందని భావిస్తున్న టీడీపీ-జనసేన పొత్తు వ్యవహారం ఇప్పుడు రాజకీయంగానూ కలకలం రేపుతోంది. ముఖ్యంగా ఈ పొత్తు ప్రయత్నాలతో వైసీపీలో కాపు నేతలు టార్గెట్ అవుతున్నారు. వైసీపీ సర్కార్ కాపులకు ఈ నాలుగేళ్లలో ఏం చేసిందనే అంశాన్ని పక్కనబెడితే కాపు సామాజిక వర్గానికి చెందిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ వైసీపీ చేస్తున్న రాజకీయం ఈ వార్ కు కారణమవుతోంది. దీంతో పవన్ కు వ్యతిరేకంగా వైసీపీ నుంచి గట్టిగా గళం వినిపిస్తున్న మంత్రులు ముందుగా టార్గెట్ అవుతున్నారు. దీంతో కాపు నేతల నుంచి వీరికి సెగ తప్పడం లేదు.

చేగొండి, అమర్నాథ్ వార్
కాపు రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న మాజీ మంత్రి, కీలక కాపు నేత చేగొండి హరిరామజోగయ్య ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ మంత్రులకు కంటగింపుగా కూడా మారుతున్నారు. పవన్ ను టార్గెట్ చేస్తున్న వైసీపీ మంత్రులపై హరిరామజోగయ్య చేస్తున్న వార్ తో ఈ వ్యవహారం మరింత ముదురుతోంది. ముఖ్యంగా పవన్ కు అండగా నిలుస్తున్న కాపు నేత హరిరామజోగయ్యను టార్గెట్ చేస్తూ ఆయనకు మంత్రి గుడివాడ అమర్నాథ్ రాస్తున్న లేఖలు కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా కాపుల శత్రువు అయిన చంద్రబాబుకు పవన్ మద్దతెలా ఇస్తారంటూ అమర్నాథ్ హరిరామజోగయ్యను ప్రశ్నిస్తున్నారు. దీంతో ఆయన కూడా ఘాటుగా బదులిస్తున్నారు.

రంగా హంతకుడికి పవన్ మద్దతా ?
మంత్రి గుడివాడ అమర్ నాథ్, కాపు నేత చేగొండి హరిరామజోగయ్యకూ మధ్య సాగుతున్న లేఖల పరంపరలో తాజాగా మంత్రి మరో లేఖ రాశారు. ఇందులో ఎప్పుడో మూడు దశాబ్దాలక్రితం జరిగిన కాపు నేత వంగవీటి రంగా హత్యను ప్రస్తావించారు. ఈ హత్యకు కారణమైన చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ మద్దతు ఎలా ఇస్తారంటూ ఆయన జోగయ్యను ప్రశ్నించారు. వంగవీటి రంగాను చంపింది చంద్రబాబేనని మీరు పలు సందర్భాల్లో చెప్పారని, అలాంటి చంద్రబాబుకు పవన్ మద్దతెలా ఇస్తారని అమర్ నాథ్ ప్రశ్నిస్తున్నారు. దీనిపై జోగయ్య ఏం సమాధానం చెప్తారో చూడాలి.












Click it and Unblock the Notifications