ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మలుపు తిప్పనున్న గుడివాడ ''మినీ మహానాడు''!!
తెలుగుదేశం పార్టీ కృష్ణా జిల్లా గుడివాడలో నిర్వహిస్తున్న మినీ మహానాడు, బహిరంగ సభ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మలుపు తిప్పే కీలక కార్యక్రమాలనే విశ్లేషణ వ్యక్తమవుతోంది. ఒంగోలులో మహానాడు నిర్వహించిన తర్వాత ప్రతి జిల్లాలో టీడీపీ మినీ మహానాడులు నిర్వహిస్తూ వస్తోంది. వీటికి ప్రజల నుంచి కూడా అనూహ్య స్పందన వ్యక్తమవుతోంది. అందులో భాగంగానే కృష్ణా జిల్లా మినీ మహానాడును గుడివాడలో నిర్వహించాలనుకుంటున్న సంగతి తెలిసిందే.
గుడివాడ నియోజకవర్గంలో మినీ మహానాడును తలపెట్టాలనేది చంద్రబాబునాయుడి వ్యూహంలో భాగమే. ఈ కార్యక్రమాన్ని టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రజలు భారీగా తరలివచ్చేలా తెలుగుదేశం పార్టీ శ్రేణులు కృషిచేస్తున్నాయి. అలాగే భారీ సభకు కూడా గుడివాడను ఎంచుకోవడం రాజకీయ వ్యూహంలో భాగమే. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు సొంత నియోజకవర్గం కావడంతో ఈ నియోజకవర్గంతో టీడీపీకి ప్రత్యేక అనుబంధం ఉంది.

రాబోయే ఎన్నికల్లో బీజేపీ తరఫున ఎన్టీఆర్ కుమార్తె పురంధేశ్వరి గుడివాడ నుంచి పోటీచేయబోతుందనే వార్తలు కూడా వస్తున్నాయి. అలాగే చంద్రబాబునాయుడు, లోకేష్‌పై వ్యక్తిగత దూషణలకు దిగుతూ పార్టీపై నిప్పులు చెరుగుతున్న మాజీ మంత్రి కొడాలి నానికి గట్టి సమాధానం ఇవ్వాలనే ఉద్దేశంతోనే అక్కడ మినీ మహానాడు ఏర్పాటు చేబోతున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డితో సన్నిహితంగా మెలుగుతూ చీటికీ మాటికీ పార్టీపై విరుచుకుపడే నానికి ఈసారి ఎన్నికలతో చెక్ పెట్టాలనే యోచనలో చంద్రబాబు ఉన్నారు. అందుకు తగ్గట్లుగా వ్యూహాలను రూపొందిస్తున్నారు.
మినీ మహానాడును, బహిరంగసభను విజయవంతం చేయడంద్వారా గుడివాడ నియోజకవర్గమంటే తెలుగుదేశం పార్టీ అడ్డా అని చాటిచెప్పాలన్న పట్టుదలతో పార్టీ శ్రేణులు ఉన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం చేయడంద్వారా శ్రేణుల్లో మనస్థైర్యం పెంచాలని చంద్రబాబు భావిస్తున్నారు. గుడివాడ మినీ మహానాడు రాష్ట్ర రాజకీయాలను మలుపుతిప్పే కీలక కార్యక్రమంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు తలపోస్తున్నాయి. ఇది విజయవంతమైన తర్వాత వచ్చే స్పందనను బట్టి మరిన్ని వ్యూహాలు రూపొందించాలనే యోచనలో చంద్రబాబు ఉన్నారు. ఏదేమైనప్పటికీ రాజకీయంగా చంద్రబాబునాయుడు చురుగ్గా, వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ అధికార పార్టీని హడలెత్తిస్తున్నారని సీనియర్ రాజకీయవేత్తలు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications