Gudivada: గుడివాడ లెక్క మారిపోయిందా ? ఓటింగ్ సరళి ఏం చెబుతోంది ?
ఏపీలో ఈసారి ఎన్నికల్లో హాట్ సీట్ గా భావించిన గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంపై అందరి దృష్టీ నెలకొంది. నిన్న అక్కడ పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. ఈసారి నాలుగు సార్లు సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ మాజీ మంత్రి కొడాలినానిపై టీడీపీ ఎన్నారై అభ్యర్ధి వెనిగండ్ల రాము పోటీ చేశారు. అయితే గతానికి భిన్నంగా టీడీపీ గ్రూపులన్నీ వెనిగండ్ల రాముకు మద్దతుగా నిలవడం, స్థానికంగా నెలకన్న సమీకరణాలు, కొడాలి నానిపై వ్యతిరేకత మధ్య ఈ ఎన్నికల పోలింగ్ జరిగింది.
ఈ నేపథ్యంలో గుడివాడలో ఈసారి జరిగిన ఎన్నికల్లో కొడాలి నాని ఓటమి తథ్యమన్న మాట సర్వత్రా వినిపిస్తోంది. స్థానికంగా కొడాలి నానిపై వ్యతిరేకత క్రమంగా పెరుగుతూ వస్తోంది. ముఖ్యంగా గత నాలుగు ఎన్నికల్లో మూడుసార్లు ఆయన గెలిచినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. ఈసారి అధికారంలో ఉండటం, తొలిసారి మంత్రి కూడా కావడంతో అంచనాలు భారీగా పెరిగాయి. వీటిని నిలబెట్టుకోవడంలో కొడాలి నాని విఫలమైనట్లు తెలుస్తోంది.

పదే పదే తన సామాజికవర్గానికే చెందిన విపక్ష నేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ పై బూతులతో విరుచుకుపడటం, పొరుగునే ఉన్న గన్నవరం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న వల్లభనేని వంశీని సైతం టీడీపీ నుంచి వైసీపీలోకి తెచ్చి మరీ ఆ పార్టీని టార్గెట్ చేయడం, ఈ క్రమంలో వంశీ చంద్రబాబు భార్య భువనేశ్వరిపై చేసిన వ్యాఖ్యలు వీరిద్దరికీ మైనస్ గా మారినట్లు తెలుస్తోంది. దీంతో ఈసారి ఎన్నికల్లో కమ్మ సామాజిక వర్గం వీరి విషయంలో కసిగా పనిచేసినట్లు తెలుస్తోంది.
మరోవైపు నాని ప్రత్యర్థి వెనిగండ్ల రాము భార్య ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం, మామ పాస్టర్ కావడంతో రెండేళ్లుగా ఎస్సీ మాదిగ వర్గాన్ని తమవైపు తిప్పుకోవడంలో ఆయన సక్సెస్ అయినట్లు తెలుస్తోంది. అలాగే టీడీపీలో గ్రూపులతో పాటు కొడాలి నాని అనుచరుల్ని కూడ భారీగా టీడీపీలో చేర్చుకోవడంలో రాము విజయవంతం అయ్యారు. దీని ప్రభావం ఈసారి ఎన్నికలపై కనిపించిందని చెప్తున్నారు. అలాగే గుడివాడలో గత 20 ఏళ్లుగా అభివృద్ధి లేమి కూడా కొడాలికి శాపంగా మారినట్లు ఈసారి పోలింగ్ సరళి చూసిన వారు చెప్తున్నారు. ఇవన్నీ వాస్తవమైతే ఫలితాల్లో కొడాలికి నిరాశ తప్పేలా లేదు.












Click it and Unblock the Notifications