మీరు పనిచేయట్లేదని ఇక్కడ కచ్చితంగా అర్థమవుతోందండీ!!
ఐప్యాక్ నివేదిక ప్రకారం ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని ప్రజాప్రతినిధులు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని, అనుకున్నస్థాయిలో పనితీరు కనపరచలేకపోతున్నారని తెలుస్తోంది
పనిచేసేవారికి టికెట్ ఖాయమని మొదటి నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఖరాఖండిగా చెబుతూ వస్తున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రజాప్రతినిధులకు కచ్చితంగా సీట్లుంటాయని ఆయన హామీ ఇస్తున్నారు. ప్రారంభంలో ఈ కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేసినవారు కూడా టికెట్ల పరిస్థితి అలా ఉంటే జిల్లాల్లోని ప్రజాప్రతినిధుల పనితీరు ఎలా ఉందనే విషయంలో జగన్ ఎప్పటికప్పుడు ఐప్యాక్ ద్వారా నివేదికలు తెప్పించుకుంటున్నారు.
ఐప్యాక్ నివేదిక ప్రకారం ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని ప్రజాప్రతినిధులు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని, అనుకున్నస్థాయిలో పనితీరు కనపరచలేకపోతున్నారని తెలుస్తోంది. గూడూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే వరప్రసాద్, గిద్దలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అన్నా రాంబాబు పరిస్థితి అనుకున్నస్థాయిలో లేదంటున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన అన్నా రాంబాబుపై సొంత పార్టీలోని నేతలే తిరుగుబాటు చేసే పరిస్థితి ఉందని తెలుస్తోంది. రెండుసార్లు మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవిని దక్కించుకోలేకపోయినందుకు అన్నా రాంబాబు అధిష్టానంపై చిన్నబుచ్చుకున్నారు. అయినప్పటికీ అధిష్టానం వైపు నుంచి ఆయన్ను ఎవరూ బుజ్జగించలేదు. దీంతో రాంబాబు పార్టీలో ఉంటారా? లేదా? అనుమానాన్ని స్థానిక వైసీపీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు.

సొంత పార్టీ నేతల నుంచి తనకు ఎలాంటి ఆదరణ, ప్రోత్సహం లభించడంలేదని, ఎవరూ మద్దతివ్వడంలేదని వరప్రసాద్ వాపోతున్నారు. ఈయన మాజీ ఐఏఎస్ అధికారి. 2014 ఎన్నికల్లో తిరుపతి నుంచి ఎంపీగా విజయం సాధించారు. తర్వాత 2019 ఎన్నికల్లో గూడూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. స్థానిక వైసీపీ నాయకులు చెబుతున్నదాని ప్రకారం వరప్రసాద్ పెత్తనం ఎక్కువైందని, అంత అజమాయిషీని తాము బరాయించలేమని కుండబద్ధలు కొట్టినట్లు చెబుతున్నారు.
స్థానిక నాయకత్వం ఈ రెండు నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలను తీవ్రంగా వ్యతిరేకిస్తుండటంతో వచ్చే ఎన్నికల్లో వీరికి సీట్లుంటాయా? లేదా? అనే సందేహాన్ని వైసీపీ శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications