గన్‌మెన్లను మార్చారు.. నాకేదైనా జరిగితే జగన్‌దే బాధ్యత: దస్తగిరి
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడైన డ్రైవర్ దస్తగిరి అప్రూవర్ గా మారిన సంగతి తెలిసిందే. అయితే అకస్మాత్తుగా దస్తగిరి గన్ మెన్లను ప్రభుత్వం మార్చింది. వెంటనే ఎస్పీ కార్యాలయానికి వెళ్లి తనకు రక్షణ కల్పించాలని కోరారు. గన్ మెన్లను మార్చారని, తనకేదైనా జరిగితే ముఖ్యమంత్రి జగన్ దే బాధ్యత అని ఫిర్యాదు చేశారు. సమాచారం ఇవ్వకుండా గన్ మెన్లను మార్చారని, ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎస్పీ పట్టించుకోవడంలేదని వాపోయాడు. సీబీఐ ఏఎస్పీ రామ్ సింగ్ ఆదేశాలతోనే మరోసారి ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. తొండూరు మండలానికి చెందిన వైసీపీ నేతలు తనపై అక్రమంగా కేసులు పెట్టిస్తున్నారని చెప్పారు. సహనిందితులకు అప్పీల్ చేసే అధికారం లేదని సుప్రీంకోర్టు తెలిపిన రోజే ఎస్పీ కార్యాలయానికి వెళ్లిన దస్తగిరి రక్షణ కావాలని కోరారు. అప్రూవర్ గా మారిన దస్తగిరికి క్షమాభిక్ష పెట్టడంపై దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, గజ్జల ఉమాశంకర్ రెడ్డి సుప్రీంలో సవాల్ చేయగా వారి పిటిషన్లను న్యాయస్థానం డిస్మిస్ చేసింది.

2019 ఎన్నికలకు ముందు వైఎస్ వివేకా హత్యకేసు రాజకీయంగా సంచలనం కలిగించింది. అనేక నాటకీ పరిణామాల అనంతరం కేసు దర్యాప్తు సీబీఐ చేతికి చేరింది. దర్యాప్తు చేసి ఛార్జిషీట్లను దాఖలు చేసిన సీబీఐ వాటిని కోర్టుకు అందజేసింది. దాదాపు ఆరునెలలకు పైగా విరామం తర్వాత దర్యాప్తును అధికారులు పున: ప్రారంభించారు. సీబీఐ ఏఎస్పీ రామ్ సింగ్ కు కొందరు వ్యక్తుల నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. కడప సెంట్రల్ జైలుకెళ్లి తిరిగి వచ్చే క్రమంలో వారి వాహనాన్ని ఆపి బెదిరింపులకు గురిచేసిన సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది. దీనిపై అధికారుల వాహన డ్రైవర్ కడప పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.