ఏపీలో చరిత్ర సృష్టించిన గుంటూరు నగరం
రాష్ట్రంలో ప్రధాన నగరంగా ఉన్న గుంటూరు మరో రికార్డుకు చేరువలో ఉంది. దాదాపుగా ఈ నగర జనాభా తొమ్మిది లక్షలకు పైగానే ఉంది. ఈ ఏడాది చివరకు పది లక్షల జనాభా సంఖ్యను దాటుతుందని ఎక్‌రాప్ అనే సంస్థ తన నివేదికలో వెల్లడించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ద్వితీయ శ్రేణి నగరాలు శరవేగంగా ఎదుగుతున్నాయి. ప్రధానంగా ఏపీలో పెద్ద నగరాలుగా విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, కర్నూలు, తిరుపతి ఉన్నాయి. ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించి అభివృద్ధి చేస్తుండటంతో అమరావతికి రెండువైపులా ఉన్న గుంటూరు, విజయవాడ కలిసిపోయి అతిపెద్ద నగరంగా ఆవిర్భావించే అవకాశం ఉంది.
కొత్తగా ఉపాధి అవకాశాలు
విశాఖపట్నం, విజయవాడతోపాటు గుంటూరు కూడా పది లక్షలమందికి పైగా జనాభా ఉన్న నగరంగా మారనుండటంతో ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి స్థిరపడేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఉపాధి కోసం తాత్కాలికంగా వచ్చినవారు ఇక్కడ స్థిరపడుతున్నారు. విజయవాడ నగరం చుట్టుపక్కల ప్రాంతాలు కలుపుకుంటే 18 లక్షల వరకు జనాభా ఉండొచ్చనే అంచనా ఉంది. అలాగే గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాలను కలుపుకొని గ్రేటర్ గుంటూరుగా ఆవిర్భవించబోతోంది. ఎక్కడ ఉపాధి అవకాశాలుంటే అక్కడకు వలస వెళ్లడం సహజంగా జరుగుతుండేదే. ప్రస్తుతం గుంటూరులో కూడా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉపాధి అవకాశాలు మెరుగుపడుతున్నాయి.

నిర్మాణం పూర్తికావొచ్చిన హైవే
రాజధాని అమరావతికి ఇప్పటికే గుంటూరు నుంచి రవాణా సౌకర్యం మెరుగ్గా ఉంది. గోరంట్ల నుంచి హైకోర్టు వరకు నేరుగా రహదారి నిర్మించాలనే ప్రతిపాదన రాజధాని మాస్టర్ ప్లాన్ లో ఉంది. ఈ రహదారి నిర్మిస్తే తాడికొండతో సంబంధం లేకుండా నేరుగా రాజధాని అమరావతికి చేరుకోవచ్చు. అలాగే గుంటూరుకు సమీపంలోని కాజా టోల్ ప్లాజా దగ్గర నుంచి విజయవాడ నగరంతో సంబంధం లేకుండా జాతీయ రహదారి నిర్మాణం దాదాపు పూర్తికావొచ్చింది. దీంతో హైదరాబాద్ వెళ్లే వాహనాలన్నీ ఇక్కడి నుంచి నేరుగా ఇబ్రహీంపట్నం చేరుకుంటాయి. విశాఖపట్నంవైపు వెళ్లే వాహనాలన్నీ కృష్ణా జిల్లాల్లో కలుస్తాయి. ప్రభుత్వాలు ద్వితీయశ్రేణి నగరాలమీద దృష్టిపెడితే అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుంది.












Click it and Unblock the Notifications