గుంటూరు వాసులకు గుడ్ న్యూస్..! విజయవాడ, తిరుపతి బాటలో..!
ఏపీలో కూటమి సర్కార్ ఏడాదిన్నర పాలన పూర్తి చేసుకుంటున్న తరుణంలో రాష్ట్రంలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా భారీ ఎత్తున తరలివస్తన్న పెట్టుబడులు మౌలిక సదుపాయాల విస్తరణపై ఆశలు రేకెత్తిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్లు కాస్తా ఇప్పుడు మళ్లీ తెరపైకి వస్తున్నాయి. ఇదే క్రమంలో గ్రేటర్ విశాఖ తరహాలోనే గ్రేటర్ విజయవాడ, గ్రేటర్ తిరుపతి డిమాండ్లు రావడంతో ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. వీటికి కొనసాగింపుగా ఇప్పుడు గ్రేటర్ గుంటూరు డిమాండ్ తెరపైకి వచ్చింది.
ఈ మేరకు తాజాగా సమావేశమైన గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ గుంటూరు ను కూడా గ్రేటర్ గా మార్చేందుకు ప్రతిపాదన ప్లాన్ కు ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా నగరం చుట్టూ విస్తరించిన పలు గ్రామాల్ని కార్పోరేషన్ లో విలీనం చేసి గ్రేటర్ గా మార్చేందుకు మేయర్ కోవెలమూడి రవీంద్ర గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. తాజాగా విజయవాడ, తిరుపతి నగరాలను గ్రేటర్ గా మార్చేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తున్న తరుణంలో గుంటూరు కార్పోరేషన్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.

గుంటూరు కార్పోరేషన్ ఆమోదించిన ప్లాన్ ప్రకారం కొత్తగా ఏర్పాటయ్యే గ్రేటర్ గుంటూరు కార్పోరేషన్ లో మొత్తం 18 గ్రామాలు విలీనం చేయాలని ప్రతిపాదిస్తున్నారు. వీటిలో గుంటూరు మండలంలోని లాల్ పురం, చల్లావారిపాలెం, వెంగళాయపాలెం, మల్లవరం, చిన్నపలకలూరు, తోక వారిపాలెం, తురకపాలెం, గొర్లవారిపాలెం, ఓబుల్ నాయుడుపాలెం, జొన్నలగడ్డ.. పెదకాకాని మండలంలోని అగతవరప్పాడు, వెనిగండ్ల, పెదకాకాని, తక్కెళ్ళపాడు, చంద్రపాలెం.. వట్టి చెరుకూరు మండలంలోని కొర్నె పాడు, పుల్లడిగుంట, తాడికొండ మండలం లాం గ్రామాలు ఉన్నాయి.

వీటిని ప్రస్తుతం ఉన్న గుంటూరు కార్పోరేషన్ లో విలీనం చేయడం ద్వారా గ్రేటర్ గుంటూరు కార్పోరేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు కౌన్సిల్ లో ఆమోదించిన తీర్మానాన్ని ప్రభుత్వానికి పంపనున్నారు. దీన్ని ప్రభుత్వం కూడా ఆమోదిస్తే చర్యలు వేగం పుంజుకోనున్నాయి. గుంటూరు నగరాన్ని మిలీనియం సిటీ కాన్సెప్ట్ భాగంగా మహా నగరపాలక సంస్థగా విస్తరించేందుకు సిద్దంగా ఉన్నట్లు మేయర్ కోవెలమూడి రవీంద్ర తెలిపారు.












Click it and Unblock the Notifications