VIDEO: నడిరోడ్డుపై మహిళను నగ్నంగా..! సీఎం సీరియస్, లోకేష్ స్ట్రాంగ్ యాక్షన్
ఆడబిడ్డల ఆత్మగౌరవానికి పెద్దపీట వేస్తామని, మహిళల భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, హోంమంత్రి వంగలపూడి అనిత నిత్యం చెబుతున్నప్పటికి.. కొందరు అధికార పార్టీ నేతలు ఆ మాటలకు నిలువునా పాతర వేస్తున్నారు. గుంటూరు నగరంలో చోటుచేసుకున్న ఒక అత్యంత అమానవీయ ఘటన.. పాలకుల ఉద్దేశాలకు, క్షేత్రస్థాయి వాస్తవాలకు మధ్య ఉన్న తేడాను స్పష్టం చేస్తోంది. ఒక సాధారణ నీటి మోటర్ రగలుకున్న వివాదంలో అధికార పార్టీ నేత కుటుంబం బరితెగించి, ఒక మహిళను నడిరోడ్డుపై వివస్త్రను చేసి కాళ్లతో తన్నిన వైనం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
క్షణికావేశమా.. అధికార అహంకారమా?
గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణబాబు కాలనీలో ఈ భయానక ఘటన వెలుగుచూసింది. నీటి మోటార్ వేసే విషయంలో 21వ వార్డు తెలుగుదేశం పార్టీ సెక్రటరీ మల్లెల మూర్తి కుటుంబ సభ్యులకు, స్థానిక మహిళకు మధ్య చిన్నపాటి వివాదం మొదలైంది. ఈ గొడవ కాస్తా ముదరడంతో, మల్లెల మూర్తి కుటుంబం అమానవీయంగా ప్రవర్తించింది. కొందరు హిజ్రాలతో కలిసి మహిళపై దాడికి దిగారు. అంతటితో ఆగక నడిరోడ్డుపైనే ఆమెను వివస్త్రను చేసి కాళ్లతో తంతూ.. చావబాదారు. ఈ దాడికి సంబంధించిన భయానక సీసీటీవీ (CCTV) దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో సమాజం తలదించుకునే పరిస్థితి ఏర్పడింది.

ఉపేక్షించేది లేదు.. సీఎం వార్నింగ్
గుంటూరులో మహిళపై జరిగిన దాడి ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఏ ఒక్క మహిళకు అవమానం జరిగినా అది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, మన సమాజంలో ఇలాంటి అనాగరిక చర్యలకు తావులేదని ఆయన స్పష్టం చేశారు.
ఈ ఘటనపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు సీఎం తెలిపారు. ఇప్పటికే నిందితులపై క్రిమినల్ కేసు నమోదు చేసి, వారిని అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. ఈ దారుణంలో ప్రమేయం ఉన్న సదరు పార్టీ నాయకుడిని తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
"మా ప్రభుత్వ నినాదం ఒక్కటే.. పక్షపాతం, భయం లేకుండా చట్టం తన పని తాను కఠినంగా చేసుకుపోతుంది. రాజకీయ అండదండలు ఉన్నాయనే నెపంతో తప్పు చేసిన ఏ ఒక్క వ్యక్తికీ రక్షణ కల్పించే ప్రసక్తే లేదు. ఆంధ్రప్రదేశ్‌లో ఉండే ప్రతి మహిళకూ తన గౌరవానికి, రక్షణకు ఈ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందనే నమ్మకాన్ని కల్పిస్తాం." అని హెచ్చరించారు
I am deeply disturbed by the incident reported from Guntur. The humiliation of any woman is completely unacceptable and has no place in our society.
— N Chandrababu Naidu (@ncbn) July 18, 2026
I have ordered immediate and stringent action. A criminal case has been registered, the accused has been arrested, and the party…
గుంటూరు ఘటనపై నారా లోకేష్ సీరియస్
గుంటూరు ఘటనపై మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి, ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నిందితుడిపై వెంటనే క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు తెలిపారు. ఘటనలో ప్రమేయం ఉన్న టీడీపీ నాయకుడిని పార్టీ పదవుల నుంచి సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. రాజకీయ అండ లేదా పార్టీ అనుబంధం చట్టం నుంచి ఎవరినీ కాపాడదని స్పష్టం చేశారు. మహిళలపై దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, నిందితులెవరైనా చట్టం ముందు సమానమేనని హెచ్చరించారు.
తీవ్రంగా స్పందించిన ఎమ్మెల్యే.. పార్టీ నుంచి సస్పెన్షన్
ఈ దారుణ ఘటనపై గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు గల్లా మాధవి తీవ్రంగా స్పందించారు. బాధిత మహిళ తనను కలిసి ఆవేదన వ్యక్తం చేసిన వెంటనే ఎమ్మెల్యే పోలీసులతో మాట్లాడి కఠిన చర్యలకు ఆదేశించారు. "మహిళల గౌరవం, భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు" అని స్పష్టం చేసిన ఎమ్మెల్యే మాధవి.. నిందితుడు మల్లెల మూర్తిని తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా శిక్ష తప్పదని, బాధిత కుటుంబానికి తాము పూర్తి అండగా ఉంటామని ఆమె భరోసా ఇచ్చారు.
గుంటూరులో మహిళపై దాడి.. టీడీపీ నేత మల్లెల మూర్తి సస్పెండ్..!!#MallelaMurthy #GallaMadhavi #TDP #Guntur #NewsUpdate #OIReels #Oneindiatelugu pic.twitter.com/YK4iEEyZKv
— oneindiatelugu (@oneindiatelugu) July 18, 2026
కటకటాల్లోకి నిందితులు..
వైరల్ అయిన సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నగరంపాలెం పోలీసులు తక్షణమే రంగంలోకి దిగారు. ఘటనపై పక్కా ఆధారాలతో కేసు నమోదు చేసి, దాడికి పాల్పడిన నిందితులను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. మహిళలపై ఇలాంటి అనాగరిక దాడులకు పాల్పడే వారిని చట్టపరంగా కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం మహిళల రక్షణ కోసం గట్టి చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నా, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత పోలీసు యంత్రాంగంపై ఎంతైనా ఉంది.












Click it and Unblock the Notifications