గుంటూరు మహిళా ఎమ్మెల్యేకు అధికారుల షాక్..! సీఎం వద్దే తేల్చుకుంటా..!
గుంటూరులో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన టీడీపీ నేత గళ్లా మాధవికి అధికారులు ఈ మధ్య షాకులిస్తున్నారు. ముఖ్యంగా అధికారిక కార్యక్రమాలు ఏర్పాటు చేసి కూడా ఆమెను పిలవకుండానే వాటిని కానిచ్చేస్తున్నారు. దీంతో ఎమ్మెల్యేకు చిర్రెత్తుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన గళ్లా మాధవి.. అధికారులపై ఫైర్ అయ్యారు. ఈ వ్యవహారాన్ని సీఎం వద్దే తేల్చుకోవాలని నిర్ణయించారు.
ప్రభుత్వ అధికారుల తీరుపై గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవి ఇవాళ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ విషయంలో ప్రభుత్వ అధికారులు విభజించు పాలించు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తన నియోజకవర్గంలో తనకు తెలియకుండా కార్యక్రమాలు చేపడుతున్నారని మండిపడ్డారు. అనేకసార్లు అధికారులకు చెప్పినా ఫలితం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై సీఎం చంద్రన్న దృష్టికి తీసుకొని వెళ్తానని మాధవి తెలిపారు.

కార్పొరేషన్ అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని గళ్లా మాధవి విమర్శించారు. తనకు సమాచారం ఇవ్వకుండానే నియోజకవర్గంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. తుఫాను బాధితులకు సాయం విషయం కూడా తనకు తెలియదన్నారు. అధికారుల తీరు 'విభజించి పాలించే' తరహాలో ఉందన్నారు. అధికారులది అమాయకత్వమా? అహంకారమా? అని గళ్లా మాధవి ప్రశ్నించారు.

ప్రభుత్వ కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు, ప్రధాని మోడీ ఫోటోలు పెట్టకపోవడంపైనా ఎమ్మెల్యే మాధవి అసంతృప్తి వ్యక్తం చేశారు. సచివాలయాల్లో సామాన్యులకు పనులు అయ్యే పరిస్థితి లేదని ఆమె ఆరోపించారు. తాను చేసిన ఆరోపణలపై అధికారుల దగ్గర నుంచి సమాధానం వస్తుంది అని ఆశిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ అంశాలను కచ్చితంగా పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్తానని ఎమ్మెల్యే గళ్ళా మాధవి హెచ్చరించారు.












Click it and Unblock the Notifications