ఏపీలో విద్యార్థులకు ఒంటిపూట బడులు.. ఆ డిమాండ్; ప్రభుత్వ నిర్ణయం!!
తెలంగాణ రాష్ట్రంలో ఒంటిపూట బడులపై ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. తెలంగాణ రాష్ట్రంలో మార్చి 15వ తేదీ నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పటి నుంచి ఒంటిపూట బడులు ప్రారంభమవుతాయి అనేది మాత్రం ఇప్పటివరకు క్లారిటీ లేదు.
ప్రతి సంవత్సరం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకే సమయానికి ఒంటిపూట బడులు ప్రారంభిస్తున్నా, ఈసారి ఏపీ ప్రభుత్వం ఒంటిపూట బడుల పై క్లారిటీ ఇవ్వకపోవడంతో విద్యార్థి సంఘాల నుండి ఆసక్తికరమైన డిమాండ్ వినిపిస్తుంది. ఈ సంవత్సరం విపరీతంగా ఎండలు ఉంటాయని, విద్యార్థులు వడదెబ్బ బారిన పడే ప్రమాదం ఉందని వెంటనే ఒంటిపూట బడులను నిర్వహించాలని ఎస్టియు డిమాండ్ చేస్తుంది.

ఈ మేరకు అధికారులకు వినతిపత్రం అందజేయడంతో పాటు, మార్చి 11వ తేదీ నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రధానంగా తమ డిమాండ్ ను వినిపిస్తుంది. విద్యార్థుల క్షేమం గురించి ఆలోచించి ప్రభుత్వం, తక్షణం నిర్ణయం తీసుకుని ఒంటిపూట బడులపై ప్రకటన చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
అయితే ఒంటిపూట బడులతో పాటు వేసవి సెలవులపై కూడా ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏప్రిల్ 25వ తేదీ నుంచి జూన్ 11వ తేదీ వరకు వేసవి సెలవులను ప్రకటించనున్నట్లు సమాచారం. అయితే ఇది అధికారికంగా వెల్లడి కావలసి ఉంది. పదో తరగతి పరీక్షలు ఈ నెల 18వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి.
ఈ నేపథ్యంలో పదవ తరగతి పరీక్షలు ఉన్న కేంద్రాలలో మధ్యాహ్నం నుంచి తరగతులను నిర్వహించే అవకాశం ఉంటుందని సమాచారం. ఈ స్కూళ్లలో మధ్యాహ్నం భోజనం అందించిన తర్వాత తరగతులు కొనసాగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మళ్లీ పదో తరగతి పరీక్షలు ముగిసిన తర్వాత యధావిధిగా ఉదయం పూటనే తరగతులను నిర్వహించాలని ఆలోచిస్తున్నారట.
ఏది ఏమైనా ఏపీ ప్రభుత్వం త్వరితగతిని నిర్ణయం తీసుకుని, ఆ నిర్ణయాన్ని వెల్లడించాలని డిమాండ్ వినిపిస్తుంది. విపరీతంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మార్చి 11 నుండి ఒంటిపూట బడులు ప్రకటించాలని డిమాండ్ వినిపిస్తుంది. మరి ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications