షర్మిలా! అప్పుడు గుర్తుకు లేదా?, కోత పెడితే..: హరీష్
హైదరాబాద్: దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి తన హయాంలో హైదరాబాదులోని భూములు అమ్ముకున్నప్పుడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు షర్మిలకు హైదరాబాద్ పాకిస్తాన్‌లా కనిపించలేదా? అని తెలంగాణ రాష్ట్ర సమితి శాసన సభ్యుడు హరీష్ రావు గురువారం మండిపడ్డారు.
షర్మిల హైదరాబాదును పాకిస్తాన్‌తో పోల్చడం శోచనీయమన్నారు. విద్యుత్ ఉద్యోగులు సమ్మె ఎందుకు చేస్తున్నారో చెప్పాలన్నారు. సమైక్యాంధ్ర కోసం ఉద్యోగులు సమ్మె చేస్తూ తమ ప్రాంతానికి కోతలు విధిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సీమాంధ్రలో ఆర్టీసి బస్సులు బందు చేయగా, జెసి, కేశినేని ట్రావెల్స్ బస్సులు ఎందుకు నడుస్తున్నాయో చెప్పాలన్నారు.

కార్పోరేట్ కళాశాలలు సమైక్యాంధ్ర ఉద్యమంలో ఎందుకు పాల్గొనడం లేదో చెప్పాలన్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన కానిస్టేబుల్ జై తెలంగాణ అనడం తప్పైతే, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యాంధ్రకు మద్దతు పలకడం తప్పే అని హరీష్ రావు వ్యాఖ్యానించారు.
రాష్ట్రాలుగా విడిపోతున్నాం: సర్వే
తెలుగు వారిగా మనం విడిపోవడం లేదని, రాష్ట్రాలుగా మాత్రమే విడిపోతున్నామని కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ వేరుగా అన్నారు. తెలుగువారంతా ఐక్యంగా ఉండాలనే కోరుకుంటున్నానని, హైదరాబాదును ఎవరి విడిచి వెళ్లవలసిన అవసరం లేదన్నారు.
ప్రభు్తవం దొంగలకు సద్దికట్టొద్దు: టిఎన్జీవో
సీమాంధ్ర ఉద్యోగుల సమ్మెకు ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తూ దొంగలకు సద్దికడుతోందని, ఇది ప్రజలు ఎన్నకున్న ప్రభుత్వం చేయాల్సిన పని కాదని సచివాలయ టిఎన్జీవో నేత నరేందర్ రావు ఆరోపించారు. సచివాలయంలో విధులకు హాజరైన వారిని సీమాంధ్ర నేతలు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications