మొసలి కన్నీరొద్దు, చెప్పండి: హరీష్, వాటా తేల్చేందుకు
హైదరాబాద్: పోలవరం ముంపు మండలాల బదలాయింపు వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ ముసలి కన్నీరు కార్చవద్దని, నిజంగా బాధితుల పక్షాన ఉండదలిస్తే రాజ్యసభలో ఈ బిల్లును అడ్డుకోవాలని తెలంగాణ మంత్రి హరీశ్ రావు శనివారం డిమాండ్ చేశారు. రాజ్యసభలో కాంగ్రెస్‌కు మెజారిటీ ఉందని, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీపై ఒత్తిడి తీసుకు వచ్చి రాజ్యసభలో బిల్లును అడ్డుకోవాలని డిమాండ్ చేశారు.
పోలవరం ప్రాజెక్టు ముంపుమండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బిజెపి, టిడిపి నాయకులు తమ అభిప్రాయం చెప్పాలన్నారు.

పార్టీ నాయకుడు కర్నె ప్రభాకర్ తెలంగాణ భవన్‌లో ఈ అంశంపై శనివారం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ టీడీపీ, బీజేపీనాయకులు ముంపు మండలాల వ్యవహారంపై తమ పార్టీ అభిప్రాయం ఏమిటో చెప్పాలన్నారు. పొలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపడంపై నిరసన వ్యక్తం చేస్తూ శనివారం తెలంగాణ వ్యాప్తంగా బంద్ విజయవంతం అయిందన్నారు.
ఆంధ్రప్రదేశ్ బిజెపి ఎంపిలు కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు ప్రకటిస్తే, ఆ రెండు పార్టీలకు చెందిన తెలంగాణ ఎంపిలు మాత్రం మౌనంగా ఉన్నారన్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసం ఈ రెండు పార్టీలు ఏ మాత్రం ఆలోచించడం లేదని, తెలంగాణ వ్యతిరేక వైఖరి తీసుకుంటున్నాయని విమర్శించారు.
వాటా తేల్చేందుకు కొత్త ట్రైబ్యునల్ వేయాలి
కృష్ణా జాలాల కేటాయింపులో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని కేంద్ర ప్రభుత్వానికి వివరించేందుకు హరీశ్ రావు నాయకత్వంలో నిపుణుల బృందం ఢిల్లీ వెళుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా జలాల్లో మొదటి నుంచి తెలంగాణకు అన్యాయం జరిగిందని, తెలంగాణ వాదన వినిపించేందుకు, తెలంగాణకు న్యాయం జరిగేందుకు కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని, లేదా ప్రస్తుతం ఉన్న బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ముందు తెలంగాణ వాదన వినిపించేందుకు అవకాశం కల్పించాలని కోరేందుకు ఢిల్లీ వెళుతున్నారు.
బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ రాష్ట్రాల వాదన విన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడలేదని, ఇప్పుడు తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఉన్నందున తమ వాదన తాము వినిపించుకునే అవకాశం కల్పించాలని కోరనున్నారు. కృష్ణా జలాల కేటాయింపులో తెలంగాణకు ఏ విధంగా అన్యాయం జరిగిందో, ఎలాంటి మార్పులు చేయాలో వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 18 పేజీల నివేదిక రూపొందించింది. హరీశ్ రావు బృందం ఈ నివేదికను కేంద్ర మంత్రి ఉమాభారతికి అందజేస్తారు.
బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అమలులోకి వస్తే అది 2050 వరకు ఉంటుంది. తెలంగాణ ఏర్పడకముందు ఈ ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు. తెలంగాణ ఏర్పడక ముందే ట్రిబ్యునల్ నివేదిక ఇచ్చింది. ఆ తరువాత తెలంగాణ ఏర్పడినందున మారిన పరిస్థతులను దృష్టిలో పెట్టుకొని తెలంగాణకు వాదన వినిపించే అవకాశం కల్పించాలని కోరనున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్ర నాలుగు రాష్ట్రాలకు ట్రిబ్యునల్ తీర్పు వర్తిస్తుంది.












Click it and Unblock the Notifications