అజ్ఞానం, సిఫార్సు పంపుతా: జగన్ లేఖపై హరీష్
హైదరాబాద్: కేంద్ర మంత్రుల బృందానికి (జివోఎంకు) ఇచ్చిన లేఖ ద్వారా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ అజ్ఞానం బయపడిందని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు టి. హరీష్ రావు వ్యాఖ్యానించారు. అవగాహన లేకుండా జగన్ మాట్లాడుతున్నారని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శించారు. ఫజల్ అలీ కమిషన్ రెండు రాష్ట్రాల విలీనానికి సిఫార్సు చేయలేదని, కావాలంటే సిఫార్సు ప్రతులను తాను జగన్‌కు పంపిస్తానని ఆయన అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడ్డంకి కాదని పరకాలలో బైబిల్ చేత పట్టుకుని వైయస్ విజయమ్మ చెప్పిన మాటలను జగన్ మరిచిపోయారా అని ఆయన అడిగారు. రాష్ట్రాన్ని విభజిస్తే అభివృద్ధి కుంటుపడుతుందని అనడాన్ని ప్రస్తావిస్తూ అవినీతీ అక్రమాలూ చేసే జగన్ లాంటివారి అభివృద్ది మాత్రం కుంటుపడుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు అధికార భాష తెలుగు కాదని, భాషా ప్రాతిపదికపై ఏ రాష్ట్రం కూడా ఏర్పడలేదని ఆయన అన్నార.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కోతికి కొబ్బరికాయ దొరికినట్లు ప్రవర్తిస్తున్నారని హరీష్ రావు అన్నారు. మొన్న రెండు కళ్ల సిద్ధాంతం, నిన్న ఇద్దరు కొడుకుల సిద్ధాంతం, ఇప్పుడు కొబ్బరికాయ సిద్ధాంతం అంటున్న చంద్రబాబు చూస్తే జాలేస్తుందని ఆయన అన్నారు. చంద్రబాబు కొబ్బరి కాయ సిద్ధాంతాన్ని చూసి తెలుగుదేశం పార్టీ నాయకులే జట్టు పీక్కుంటున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు మానసిక స్థితిపై ఆందోళనగా ఉందని, త్వరగా ఆస్పత్రిలో చేరితే మంచిదని ఆయన అన్నారు.
కాగా, హెచ్ఎండిఎ పరిధిని ఉమ్మడి రాజధాని చేయాలని ప్రభుత్వ కార్యదర్శి నివేదిక ఇవ్వడంపై తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం మండిపడింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి సంఘం అధ్యక్షుడు శ్రీనివాస గౌడ్ కలిసి నిరసన వ్యక్తం చేశారువ. సీఎస్ కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికను బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. సిఎస్ నివేదిక ఆధారంగా విభజన జరిగితే అధికారులపై చర్యలు తప్పవని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications