కేంద్రంపై యుద్ధమే: కృష్ణా నీటిపై ఢిల్లీకి హరీష్ రావు
హైదరాబాద్: కృష్ణా జలాల కోసం కేంద్రంతో తలపడేందుకే తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైనట్లు కనిపిస్తోంది. అప్పటికీ కేంద్రం సానుకూలంగా స్పందించకపోతే న్యాయ పోరాటం చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు సోమవారం ఢిల్లీ వెళుతున్నారు. కేంద్ర జల వనరుల మంత్రి ఉమా భారతిని కలుస్తారు.
మంత్రి హరీశ్‌రావు ఢిల్లీ పర్యటన నేపథ్యంలోనే కేంద్ర జల వనరుల శాఖ కార్యదర్శికి తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి బి. అరవిందరెడ్డి లేఖ రాశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బచావత్ ట్రిబ్యునల్ సమయంలోనే తెలంగాణకు కృష్ణా జలాల కేటాయింపులో అన్యాయం జరిగిందని, బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ మధ్యంతర తీర్పు కూడా తెలంగాణ ప్రయోజనాలకు హాని కలిగిస్తున్నందున అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం సెక్షన్ 3 ప్రకారం కొత్త ట్రిబ్యునల్‌ను నియమించాలని ఆ లేఖలో కోరారు.

ఈ నెల 21న బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వేసిన పిటిషన్ వాదనలకు వస్తున్న సందర్భంలో ఆ కేసులో విడిగా పిటిషన్ వేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఎంత దూరమైనా పోరాటం చేసి.. మిగులు జలాల్లో కనీసం 80 టీఎంసీల వాటాను సాధించాలని, కర్ణాటకకు ఎక్కువ కేటాయింపులు చేసినట్టుగానే తెలంగాణకు కూడా ఎక్కువ కేటాయింపులివ్వాలని ట్రిబ్యునల్ ముందు వాదించాలని నిర్ణయించింది.
కాగా, నాగార్జునసాగర్ నుంచి తెలంగాణ, ఆంధ్రప్రాంతాలకు చెరో 13 టిఎంసిల నీటిని విడుదల చేయాలని కృష్ణా యాజమాన్య బోర్డు నిర్ణయించింది. అయితే, దాన్ని ఏకపక్ష నిర్ణయంగా తెలంగాణ అధికారులు అభివర్ణిస్తున్నారు.












Click it and Unblock the Notifications