అడిగితే సహకారం: హరీష్, ఐదేళ్లలో సీమ డిమాండ్: జెసి
వరంగల్/అనంతపురం: సీమాంధ్ర నేతలు నిధుల విషయంలో కేంద్రాన్ని అడిగితే తాము సహకరిస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి సిద్దిపేట శాసన సభ్యుడు హరీష్ రావు వరంగల్ జిల్లాలో అన్నారు. ఎపిఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు కారుకూతలు మానుకొని సీమాంధ్ర అభివృద్ధిని కోరుకోవాలన్నారు.
భద్రాచలం, హైదరాబాదు పైన ఎలాంటి ఆంక్షలు లేని తెలంగాణ తమకు కావాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరు అడ్డుపడినా తెలంగాణ ఆగే ప్రసక్తి లేదన్నారు. సీమాంధ్ర నేతలు తమ ప్రాంత అభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు. వారు కేంద్రాన్ని నిధులు కోరితే సహకరిస్తామన్నారు. విభజన అనివార్యమని కేంద్రమంత్రులు కూడా గ్రహించారన్నారు. భద్రాచలం తెలంగాణలో అంతర్భాగమేనని మరో ఎమ్మెల్యే కెటి రామారావు అన్నారు. లగడపాటి రాజగోపాల్ కు రాజకీయ సన్యాసం తప్పదన్నారు.

ఐదేళ్లలో సీమ డిమాండ్: జెసి
అనంతపురం, కర్నూలు జిల్లాలను తెలంగాణలో కలపకుంటే మరో అయిదేళ్లలో ప్రత్యేక సీమ డిమాండ్ రావడం ఖాయమని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి వేరుగా వ్యాఖ్యానించారు. కర్నూలు, అనంతలను తెలంగాణలో కలపాలన్నారు.
కోస్తా ప్రాంత నేతలు రాయల తెలంగాణకు అంగీకరించాలని విజ్ఞప్తి చేశారు. లేదంటే సీమాంధ్రకు కర్నూలు రాజధానిని చేయాలని తాము డిమాండ్ చేస్తామన్నారు. రాయల తెలంగాణకు తెలంగాణ ప్రాంత నేతలు కూడా విముఖత చూపడం లేదన్నారు.












Click it and Unblock the Notifications