ఏపికి జీవోలు పంపిస్తాం: హరీశ్, టిడిపి, కాంగ్రెస్‌పై కెటిఆర్
హైదరాబాద్/కరీంనగర్: శ్రీశైలం నీటి విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పేవన్నీ అబద్ధాలేనని తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. సచివాలయంలో ఆదివారం హరీశ్‌రావు మీడియాతో.. మాట్లాడుతూ శ్రీశైలం విద్యుత్ విషయంలో ఆంధ్ర సర్కార్ మసిపూసి మారేడుకాయ చేస్తోందని విమర్శించారు. సీమాంధ్ర నేతలు అన్ని జీవోలను తుంగలో తొక్కారని మండిపడ్డారు. యథేచ్ఛగా కుట్రలు చేస్తూ మళ్లీ తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
శ్రీశైలం ప్రాజెక్టులో 834 అడుగుల నీటి మట్టం వరకు నీటిని వినియోగించుకోవచ్చని జీవో 107లో స్పష్టంగా ఉందని, ఆ జీవో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జారీ చేసిందేనని మంత్రి హరీశ్‌రావు గుర్తు చేశారు. తమ ప్రభుత్వం ఒక్క యూనిట్ విద్యుత్‌ను కానీ, ఒక్క నీటి చుక్కను అదనంగా అడగటం లేదని ఆయన అన్నారు. జీవోలు ఉల్లంఘించింది, అబద్ధాలు చెబుతున్నదీ ఆంధ్ర సర్కారేనని ఆయన ధ్వజమెత్తారు. జీవోలు కూడా డెల్టా, రాయలసీమకు అనుకూలంగా ఉన్నవేనని ఆయన ఆరోపించారు.
జీవో 233 గురించి ఆంధ్రప్రదేశ్ నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమ ఎందుకు మాట్లాడటం లేదని హరీశ్‌రావు ప్రశ్నించారు. గత ప్రభుత్వాల హయాంలో జారీ చేసిన జీవోలను చంద్రబాబు నాయుడు, దేవినేని ఉమ, పరకాల ప్రభాకర్‌కు పంపిస్తామని హరీశ్‌రావు తెలిపారు. కృష్ణా నీటి విషయంలో తెలంగాణకు ఎప్పుడు అన్యాయం జరుగుతూనే ఉందని హరీశ్‌రావు విమర్శించారు. ప్రత్యేక రాష్ట్రంగా ఉండి ఉంటే తెలంగాణకు ఎక్కువ నీళ్లు వచ్చేవని బచావత్ ట్రిబ్యునల్ అప్పుడే చెప్పిందని హరీశ్‌రావు గుర్తు చేశారు.

కరెంటు కష్టాలకు కాంగ్రెస్, టిడిపి కారణం: కెటిఆర్
కరీంనగర్: విద్యుత్ సమస్య పట్ల బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటి శాఖ మంత్రి తారకరామారావు విమర్శించారు. కరీంనగర్ జిల్లా ముస్తాబాద్‌లో ఆదివారం జరిగిన టిఆర్‌ఎస్ సమావేశంలో పలువురు కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు కెటిఆర్ గులాబీ కండువాలేసి పార్టీలోకి స్వాగతించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కిషన్‌రెడ్డి కరెంట్ సమస్యపై బాధ్యతారహితంగా కరీంనగర్‌లో అక్టోబర్ 27న మహాధర్నా చేస్తాడట అంటూ ధ్వజమెత్తారు. ‘నువ్వు ఇక్కడ పుట్టినావా? అక్కడ పుట్టినావా? ఇక్కడి ప్రజల ఓట్లతో గెలిచావా? అక్కడి ప్రజల ఓట్లతో గెలిచావా' అంటూ కిషన్‌రెడ్డిని ఉద్దేశించి కెటిఆర్ వ్యాఖ్యానించారు. బిజెపి సహా ప్రతిపక్ష పార్టీలు కరెంట్ కష్టాలకు వాస్తవాలు తెలిసినా, కెసిఆర్ ప్రభుత్వాన్ని బద్నామ్ చేసే పనులు చేస్తున్నాయని మండిపడ్డారు. కిషన్‌రెడ్డి బాధ్యతాయుతంగా మాట్లాడటం లేదన్నారు.
‘కేంద్రంలో మీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ప్రధానిగా మోడీ ఉన్నారు. ఐఏఎస్‌ల పంపకాలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అరగంట టైమ్ ఇస్తే ఒడిసిపోయే పంచాయతీని కావాలని సాగదీస్తున్నారు' అని కెటిఆర్ ఆరోపించారు. 5 దశాబ్దాలుగా కాంగ్రెస్, టిడిపిల కారణంగా కష్టాలు వచ్చాయని, నాలుగున్నర నెలల కిందట అధికారంలోకి వచ్చిన కెసిఆర్ ప్రభుత్వాన్ని తప్పు పట్టడం సరికాదన్నారు.












Click it and Unblock the Notifications