సంచలనం:నరసరావుపేట కమిషనర్, టీపీవోలకు జైలు శిక్ష
గుంటూరు: జిల్లాలోని నర్సరావుపేట మున్సిపల్ కమిషనర్ భానుప్రతాప్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సాంబయ్యలకు జైలు శిక్ష విధిస్తూ హైకోర్టు వెలువరించిన తీర్పు సంచలనం సృష్టించింది. పట్టణానికి చెందిన న్యాయవాది, వైసిపి నేత నల్లపాటి లక్ష్మీనారాయణకు చెందిన బహుళ అంతస్తుల భవనాన్ని నిబంధనలకు విరుద్ధంగా కూల్చివేసిన కేసులో ఈ తీర్పు వెలువడింది. వివరాల్లోకి వెళితే...
నల్లపాటి లక్ష్మీనారాయణకు చెందిన భవనాన్ని 2017 ఫిబ్రవరి 20న నర్సరావుపేట మున్సిపల్ కమిషనర్ పర్యవేక్షణలో పట్టణ ప్రణాళికా విభాగం సిబ్బంది కొంతమేర కూల్చివేశారు. భవనం వద్దకు పోలీసుల సాయంతో వచ్చిన మున్సిపల్ అధికారులకు, భవన యజమానులకు పెద్ద ఎత్తున వాగ్వాదం చోటు చేసుకుంది. మున్సిపల్ సిబ్బంది భవనం గోడలు కూల్చివేసేందుకు ప్రయత్నించగా యజమాని నల్లపాటి లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులు అడ్డుకున్నారు.

ఈ నేపథ్యంలో అక్కడికి చేరుకున్న తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో డీఎస్సీ నాగేశ్వరరావు బందోబస్తు ఇవ్వడంతో మున్సిపల్ అధికారులు ఎట్టకేలకు భవనంలో కొంత మేర పగులగొట్టారు. అయితే తాము నిబంధనలకు లోబడి భవనం నిర్మించినా కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తన భవనం కూల్చివేసారంటూ లక్ష్మీనారాయణ హైకోర్టులో కమిషనర్, టీపీవోలపై ప్రైవేటు కేసు దాఖలు చేశారు.
ఈ కేసు విచారించిన ఉన్నత న్యాయస్థానం కమిషనర్ భానుప్రతాప్, టీపీవో సాంబయ్యలకు రెండు నెలల జైలు శిక్ష, రూ.2000ల జరిమానా విధించింది. అలాగే రూ.లక్ష భవనం యజమానికి నష్టపరిహారంగా కూడా చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాటు శాఖాపరమైన చర్యలు సైతం తీసుకోవాలని ఆదేశించింది. ఈ విషయమై కమిషనర్ భానుప్రతాప్, టీపీవో సాంబయ్యలను మీడియా ప్రతినిథులు వివరణ కోరగా ఇప్పటి వరకు తమకు కోర్టు నుంచి ఎలాంటి నోటీసులు అందలేదని చెబుతున్నట్లు తెలిసింది.












Click it and Unblock the Notifications