Pinnelli: పిన్నెల్లికి అంతలోనే షాకిచ్చిన హైకోర్టు-కీలక షరతు..!
ఏపీలో ఈసారి సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా మాచర్లలోని పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎమ్మెల్యే అభ్యర్ధి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఇవాళ మరో షాక్ తగిలింది. ఈవీఎం ధ్వంసం కేసులో పోలీసులు తనను అరెస్టు చేయకుండా హైకోర్టు నుంచి నిన్న ముందస్తు బెయిల్ తీసుకున్న పిన్నెల్లికి ఇవాళ తిరిగి హైకోర్టు షాకిచ్చింది. నిన్న ఇచ్చిన తీర్పు కాపీలో ఓ కీలక షరతు విధించింది.

ఈవీఎం ధ్వంసం ఘటన తర్వాత తెలంగాణకు పరారైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అక్కడి నుంచి తమిళనాడు వెళ్లిపోయినట్లు ప్రచారం జరిగింది. ఆయన్ను పట్టుకునేందుకు ఈసీ 8 పోలీసు బృందాల్ని కూడా నియమించింది. అదే సమయంలో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు పిన్నెల్లి దాఖలు చేసిన అత్యవసర పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ఆయనతో పాటు మరికొందరు ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్ధులను జూన్ 4 వరకూ అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇచ్చింది.
నిన్న సాయంత్రం ఆలస్యం కావడంతో తీర్పు కాపీ ఇవ్వని హైకోర్టు.. ఇవాళ దాన్ని ఇచ్చింది. ఇందులో పిన్నెల్లిని ఎన్నికల కౌంటింగ్ జరిగే జూన్ 4న మాచర్లకు రాకుండా నిషేధం విధించింది. మాచర్లలో పోటీ చేసిన అభ్యర్ధి అయినప్పటికీ ఈవీఎం ధ్వంసం ఘటనను దృష్టిలో ఉంచుకుని కౌంటింగ్ రోజు పట్టణంలోకి రాకుండా నిషేధం విధించింది. ఆయన్ను పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో ఉండేందుకు అనుమతించింది. దీంతో పిన్నెల్లికి ఎన్నికల కౌంటింగ్ రోజు స్వయంగా కౌంటింగ్ పర్యవేక్షించే అవకాశం లేకుండా పోయింది.












Click it and Unblock the Notifications