జగన్ కేసులపై హైకోర్టు సుమోటో విచారణ- దేశంలోనే తొలిసారన్న ఏజీ
ఏపీలో సీఎం వైఎస్ జగన్‌పై గతంలో దాఖలైన 11 క్రిమినల్ కేసుల్ని వైసీపీ సర్కార్ ఉపసంహరించుకున్న వ్యవహారం కలకలం రేపుతోంది. దీనిపై ఏపీ హైకోర్టు సుమోటో విచారణ చేపట్టడంతో ఏం జరగబోతోందన్న ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో ఇవాళ హైకోర్టు తన సుమోటో విచారణ ప్రారంభించింది. ప్రాధమిక విచారణ అనంతరం కేసు వాయిదా పడింది.
ముఖ్యమంత్రి జగన్‌పై అనంతపురం, గుంటూరు జిల్లాల్లో నమోదైన 11 కేసులను అధికారంలోకి వచ్చిన తర్వాత ఎత్తివేశారు. ఇప్పుడు ఈ అంశం హైకోర్టు పరిశీలనకు వచ్చింది. ఆ పదకొండు కేసుల ఎత్తివేత నిబంధనల ప్రకారమే జరిగిందా? ఇందులో లోటుపాట్లు ఉన్నాయా? అనే విషయాన్ని హైకోర్టు తేల్చనుంది. ఒకవేళ... కేసుల ఎత్తివేత వ్యవహారాన్ని పునఃసమీక్షించాలని న్యాయస్థానం భావిస్తే... అది పెద్ద సంచలనమే అవుతుందని న్యాయనిపుణులు పేర్కొంటున్నారు.
ఇవాళ దీనిపై విచారణ సందర్భంగా ప్రతివాదిగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ తన వాదనలు వినిపించారు.

సీఎం జగన్‌పై కేసుల ఉపసంహరణ వ్యవహారంలో హైకోర్టు క్రిమినల్ రివిజన్ పిటిషన్‌ను సుమోటోగా తీసుకోవడం ఇదే తొలిసారని అడ్వకేట్ జనరల్ శ్రీరాం సుబ్రమణ్యం న్యాయస్ధానం దృష్టికి తెచ్చారు. గతంలో దేశంలో ఎక్కడా ఇలా జరగలేదన్నారు. జగన్‌కు వ్యతిరేకంగా క్రిమినల్ కేసుల ఉపసంహరణకు తగిన కారణాలు ఉన్నాయన్నారు. అడ్వకేట్ జనరల్ వాదనలు విన్న హైకోర్టు ఈ కేసు విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది. ప్రతివాదుల్లో మిగిలిన వారి వాదనలు కూడా విన్నాక హైకోర్టు తీర్పు ఇవ్వనుంది.












Click it and Unblock the Notifications