జగన్ సర్కార్ కు హైకోర్టు షాక్- వివేకా కేసులో సీబీఐ అధికారిపై పెట్టిన కేసుపై స్టే
ఏపీలో సంచలనం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో ట్విస్టులు కొనసాగుతున్నాయి. ఈ కేసులో ఇప్పటికే పలువురు వైసీపీ నేతల ప్రమేయం బయటపెడుతున్న సీబీఐ అధికారి రామ్ సింగ్ ను ఏపీ ప్రభుత్వం టార్గెట్ చేసింది. ఆయనపై అనుమానితుడు ఉదయ్ కుమార్ రెడ్డితో కేసు పెట్టించింది. ఈ మేరకు కడప రిమ్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై హైకోర్టును ఆశ్రయించిన సీబీఐకి ఊరట లభించింది.

వివేకా హత్య కేసులో
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు వేగంగా సాగుతోంది. ఈ కేసులో పలువురు కీలక నిందితుల పాత్రను నిరూపించేందుకు సీబీఐ సిద్దమవుతోంది. ఇప్పటికే తాము చేపట్టిన దర్యాప్తు ఆధారంగా పలువురు నిందితుల పాత్రపై అభియోగపత్రాలు కూడా దాఖలు చేస్తున్న సీబీఐ.. అప్రూవర్ గా మారిన దస్తగిరి ఇస్తున్న వాంగ్మూలాల ఆధారంగా పలు వివరాలను బయటపెడుతోంది. దీంతో ఈ కేసు త్వరలో కొలిక్కి వచ్చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ దశలో పలువురు వైసీపీ నేతల పాత్రను బయటపెడుతున్న సీబీఐ అధికారి రామ్ సింగ్ ను ఏపీ ప్రభుత్వం టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది.

సీబీఐ అధికారిపై పోలీసు కేసు
వివేకా కేసులో కీలక అనుమానితుడిగా ఉన్న ఉదయ్ కుమార్ రెడ్డి తనను తప్పుడు సాక్ష్యం చెప్పాలని బెదిరిస్తున్నారంటూ సీబీఐ ఏఎస్పీ రామ్ సింగ్ పై కడపలో పిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన పోలీసులు తక్షణం ఆయనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీంతో ఈ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. ఏపీ పోలీసులు వివేకా కేసు దర్యాప్తు చేస్తున్న తమ అధికారిపై పెట్టిన కేసుపై సీబీఐ తీవ్రంగా స్పందించింది. ఏపీ పోలీసులు పెట్టిన కేసుపై హైకోర్టును ఆశ్రయించింది.

పోలీసు కేసుపై స్టే ఇచ్చిన హైకోర్టు
సీబీఐ అధికారి రామ్ సింగ్ పై ఏపీ పోలీసులు కడపలో పెట్టిన కేసుపై సీబీఐ హైకోర్టును ఆశ్రయించింది. సీబీఐ దర్యాప్తు అధికారిపై పోలీసులతో కేసు పెట్టించడంపై సీబీఐ న్యాయవాది హైకోర్టులో తీవ్ర అభ్యంతరం తెలిపారు. దీనిపై స్పందించిన హైకోర్టు పోలీసు కేసుపై స్టే విధించింది. ఈ కేసులో సీబీఐ అధికారి రామ్ సింగ్ పై తదుపరి చర్యలు తీసుకోకుండా కడప పోలీసులపై ఆంక్షలు విధించింది. దీంతో ఈ కేసులో రామ్ సింగ్ కు ఊరట లభించినట్లయింది.
Recommended Video

జగన్ సర్కార్ కు ఎదురుదెబ్బ
వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి సహా పలువురు వైసీపీ నేతల పేర్లు బయటపెడుతున్న సీబీఐ ఏఎస్పీ రామ్ సింగ్ పై పోలీసు కేసు పెట్టిన వ్యవహారంలో హైకోర్టు ఆదేశాలతో జగన్ సర్కార్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. రామ్ సింగ్ దూకుడును అడ్డుకునే లక్ష్యంతో పెట్టిన ఈ కేసుపై తదుపరి దర్యాప్తుు హైకోర్టు నిలిపివేయడంతో ఇప్పుడు ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఈ కేసులో తమ నేతల్ని సీబీఐ టార్గెట్ చేస్తోందంటూ వైసీపీ నేత సజ్జల ఆరోపించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వేసే అడుగులపై ఆసక్తి నెలకొంది.












Click it and Unblock the Notifications