చంద్రబాబుకు 17ఏ వర్తిస్తుంది-లేదు వర్తించదు.. సుప్రీంకోర్టులో రెండోరోజూ వాదనలు..
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో తన అరెస్టు, రిమాండ్ ను సవాల్ చేస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో రెండో రోజూ వాడీవేడిగా వాదనలు కొనసాగుతున్నాయి. నిన్నంతా 17ఏ వర్తింపుపై వాదనలు వినిపించిన చంద్రబాబు లాయర్ హరీష్ సాల్వే.. ఇవాళ కూడా వాటిని కొనసాగించారు. అయితే చంద్రబాబుకు 17ఏ వర్తించదంటూ సీఐడీ న్యాయవాదిగా ఉన్న ముకుల్ రోహత్గీ వాదిస్తున్నారు. వీటిపైనే వాడీవేడీగా వాదనలు సాగుతున్నాయి.

చంద్రబాబు కేసులో పార్లమెంట్ అవినీతి నిరోధక చట్టానికి చేసిన సవరణ ప్రకారం సెక్షన్ 17ఏ వర్తిస్తుందని ఆయన లాయర్ హరీష్ సాల్వే నిన్న పలు కేసుల్లో తీర్పుల్ని సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చారు. ఇవాళ కూడా ఆయన గతంలో సుప్రీం జడ్జి కేఎం జోసెఫ్ ఇచ్చిన తీర్పును ప్రస్తావించారు. అలాగే సెక్షన్ 17ఏ పరిధిలోకి వచ్చే అన్ని అంశాల్ని కోర్టు ముందు ఉంచారు. కానీ చంద్రబాబుకు సెక్షన్ 17ఏ వర్తించదంటూ ముకుల్ రోహత్గీ వాదించారు.
మరోవైపు ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి మరోసారి నోటీసులు జారీ చేయాలని సీఐడీ లాయర్ ముకుల్ రోహత్గీ కోర్టును కోరారు. నోటీసులు జారీ చేస్తే ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేస్తుందన్నారు. అయితే క్రిమినల్ ప్రొసీజర్ అంటున్నప్పుడు మళ్లీ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాల్సిన అవసరం ఏముందని సాల్వే ప్రశ్నించారు. నోటీసులు జారీ చేయొద్దని ధర్మాసనాన్ని కోరారు. అన్ని రకాల ప్రభుత్వ అధికారులకు 17ఏ రక్షణ కల్పిస్తుందని హరీష్ సాల్వే వాదించారు.
ఈ సందర్భంగా ధర్మాసనం కూడా కొన్ని సందేహాలు లేవనెత్తింది. సెక్షన్ 17ఏ ప్రొసీజర్ అంటున్నప్పుడు ఇది హక్కుగా వర్తిస్తుందా అని ప్రశ్నించింది. దీనికి సమాధానంగా చంద్రబాబు లాయర్ సాల్వే.. అది అవినీతి నిరోధక చట్టాన్ని బలోపేతం చేయడంతో పాటు దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కూడా అమల్లోకి తెచ్చినట్లు గుర్తుచేశారు. అలాగే యశ్వంత్ సిన్హా కేసులో ఇదే కారణంతో సుప్రీంకోర్టు దర్యాప్తుకు బ్రేక్ వేసిన విషయాన్ని కూడా సాల్వే కోర్టుకు గుర్తుచేశారు. అసలు ఈ సెక్షన్ ప్రకారం పోలీసులు విచారణ చేసే హక్కు ఉండదని, దర్యాప్తు చేసే అధికారం మాత్రమే ఉంటుందన్నారు.












Click it and Unblock the Notifications