3న బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీలో వర్షాలు
Heavy rains: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావం వల్ల కొద్దిరోజుల కిందటే ఏపీలో భారీగా వర్షాలు కురిశాయి. పలు జిల్లాల్లో దంచికొట్టాయి. శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకు విస్తారంగా వర్షలు పడ్డాయి. ప్రత్యేకించి- కోస్తాజిల్లాలపై దీని తీవ్రత అధికంగా కనిపించింది. ఇప్పుడు తాజాగా మరో అల్పపీడనం ఏర్పడనుంది. దీని ఫలితంగా ఏపీలో మరో విడత విస్తారంగా వర్షాలు పడే అవకాశాలు లేకపోలేదు.
ఉత్తర బంగాళాఖాతంలో సెప్టెంబర్ 3 నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇది వాయువ్య బంగాళాఖాతం, పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీర ప్రాంతాల మీదుగా కదులుతుంది. సెప్టెంబర్ 5వ తేదీ నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.

అలాగే- సెప్టెంబర్ రెండోవారంలో కూడా మరో అల్పపీడనం ఏర్పడటానికి అవకాశాలు ఉన్నాయి. ఆయా అల్పపీడన ప్రభావం ఇప్పుడే మొదలైనట్టుంది. నేడు రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడొచ్చు. అధిక వర్షపాతం నమోదు కావొచ్చని విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది.
నేడు- శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులు పడొచ్చని అంచనా వేశారు.












Click it and Unblock the Notifications