ఏపీలోని ఈ జిల్లాలకు ఎన్డీఆర్ఎఫ్ బలగాలు తరలింపు
Heavy rains: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావం వల్ల కొద్దిరోజులుగా ఏపీలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకు విస్తారంగా వర్షాలు దంచికొడుతున్నాయి. ఇవే పరిస్థితులు ఈ వారం కూడా కొనసాగనున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ అంచనా వేసింది.
దీనికి కారణం- బంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడనం. ఇది మరింత తీవ్రరూపం దాల్చింది. క్రమంగా ఇది ఏపీ దక్షిణ కోస్తా, దానికి ఆనుకునివున్న తమిళనాడు ఉత్తర ప్రాంతం, పుదుచ్చేరి వైపు కదిలే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. దీని ప్రభావంతో నేడు ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. వచ్చే అయిదు రోజులపాటు రాష్ట్రంలో విస్తృతంగా పిడుగులతో కూడిన వర్షాలు పడొచ్చు.

ఆ సమయంలో తీరం వెంబడి గంటకు 35 నుంచి 55 కిలో మీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయి. శనివారం వరకు మత్స్యకారులు చేపల వేట కోసం సముద్రం మీదికి వెళ్ళరాదని ప్రఖర్ జైన్ హెచ్చరించారు. అత్యవసర సహయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలని ప్రభావిత జిల్లాలకు పంపించామని వివరించారు.
మంగళవారం ఉదయం 8:30 గంటల నుండి బుధవారం ఉదయం 8:30 గంటల వరకు రాష్ట్రంలో సగటు వర్షపాతం 18.3 మిల్లీ మీటర్లుగా నమోదైంది. తిరుపతి జిల్లా అత్యధిక సగటు వర్షపాతం నమోదైంది. ఇక్కడ 92.3 మిల్లీ మీటర్ల మేర వర్షం కురిసింది. నెల్లూరు జిల్లా- 60.8, చిత్తూరు- 39.5, అన్నమయ్య రాయచోటి-లో 37.7, కడప- 22.9, ప్రకాశం- 24.9 మిల్లీ మీటర్ల మేర సగటు వర్షపాతం నమోదైంది.












Click it and Unblock the Notifications