సినీ పరిశ్రమలో సంచలనం.. తొలిసారిగా మెగాస్టార్ చిరంజీవి హారర్ చిత్రం?
ఐదు దశాబ్దాల ప్రస్థానం.. వందలాది పాత్రలు.. కానీ ఆ ఒక్క జానర్ మాత్రం మిగిలిపోయింది. విభిన్న పాత్రలతో కోట్లమంది అభిమానులను సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఇప్పటివరకు స్పృశించని ఏకైక జానర్ 'హారర్'. మాస్, యాక్షన్, ఫ్యామిలీ, కామెడీ, ఫాంటసీ, సోషియో ఫాంటసీ, ప్రయోగాత్మక చిత్రాలు.. ఇలా ఏ జానర్ తీసుకున్నా తన ముద్ర వేసిన మెగాస్టార్, ఇప్పటివరకు భయపెట్టే కథల జోలికి మాత్రం వెళ్లలేదు.
గత కాలపు రోజుల్లో చిరంజీవి ఇమేజ్‌కు, ఆయనకున్న మాస్ ఫాలోయింగ్‌కు హారర్ సినిమాలు సూట్ కావనే భావనతో దర్శకులు కూడా అలాంటి కథలను ఆయన వద్దకు తీసుకెళ్లడానికి సాహసించలేదు. అయితే, మారుతున్న నేటి సినిమా ట్రెండ్‌లో నటీనటుల ఇమేజ్ కంటే కథ, ఇచ్చే థియేట్రికల్ అనుభూతే ప్రధానంగా మారింది. ముఖ్యంగా థియేటర్లకు విచ్చేసే 'జెన్ జీ' ఆడియన్స్ సరికొత్త జానర్లను, గూస్‌బంప్స్ ఇచ్చే కంటెంట్‌ను ఆదరిస్తున్నారు.

త్వరలోనే కొత్త సబ్జెక్టుతో
ఈ క్రమంలోనే 'లక్కీ భాస్కర్', 'సార్' వంటి విజయవంతమైన చిత్రాలను అందించిన దర్శకుడు వెంకీ అట్లూరి చిరంజీవి కోసం ఒక పవర్‌ఫుల్ హారర్ కథను సిద్ధం చేయడం గమనార్హం. అయితే, ఇటీవలి ఇంటర్వ్యూలో ఆయనే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడిస్తూ.. "చిరంజీవి గారి కోసం ఒక హారర్ సబ్జెక్ట్ అనుకున్నాను. కానీ ఆయనకున్న భారీ స్టార్ ఇమేజ్‌కు అది సరిపోదేమోనన్న అనుమానంతో ఆ ఆలోచనను పక్కనపెట్టాను. త్వరలోనే ఆయన ఇమేజ్‌కు తగ్గ సబ్జెక్ట్‌తో వస్తాను" అని స్పష్టం చేశారు. ఇమేజ్ కు తగినట్లుగానే హారర్ చిత్రం సబ్జెక్ట్ ఉంటుందంటున్నారు.
విజువల్ ఎక్స్ పీరియన్స్
పాన్-ఇండియా స్థాయిలో బిగ్ స్టార్స్ హారర్-కామెడీ లేదా సస్పెన్స్ థ్రిల్లర్స్ వైపు అడుగులు వేస్తున్న తరుణంలో, మెగాస్టార్ కూడా సరైన విజువల్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే హారర్ థ్రిల్లర్ చేస్తే చూడాలని అభిమానులు ఆశిస్తున్నారు. కథలో విషయం ఉండి, 'విరూపాక్ష' తరహాలో సరైన సీట్-ఎడ్జ్ థ్రిల్లింగ్ అనుభూతిని అందిస్తే.. మెగాస్టార్ మాస్ క్రేజ్‌కు హారర్ జానర్ జతకలిస్తే బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ ఖాయమనేది సినీ విశ్లేషకుల అభిప్రాయం.














Click it and Unblock the Notifications