తిరుమలలో భారీ వర్షం.. కొండపై చల్లని గాలులతో వెంకన్న భక్తులకు ఉపశమనం
రోళ్ళు పగిలే ఎండలతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు అల్లాడిపోతున్నాయి. నిప్పుల కుంపటిలా తలపిస్తున్న రాష్ట్రాలలో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఇప్పుటివరకు ఎన్నడూ లేని విధంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈరోజు ఎండల తీవ్రత నుంచి కొంచెం ఉపశమనం కలిగించేలా ఏపీలో తిరుమల తిరుపతి దేవస్థానం వద్ద భారీ వర్షం కురిసింది.
తిరుమలలో మారిన వాతావరణం
ప్రతి సంవత్సరం సమ్మర్ సీజన్లో తిరుమలకు భక్తులు పోటెత్తుతారు. కానీ ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో తిరుమలకు వెళ్లే భక్తుల సంఖ్య కూడా తక్కువగానే ఉంది. వరుస సెలవులు వచ్చినప్పటికీ తిరుమలలో భక్తుల రద్దీ పెద్దగా పెరగలేదు. ఇక తిరుమలకి వెళ్ళిన భక్తులు కూడా ఎండల దెబ్బకు ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు మధ్యాహ్నం తిరుమల తిరుపతి దేవస్థానం సమీపంలో ఒక్కసారిగా వాతావరణం మారింది.

అరగంట పాటు కురిసిన భారీ వర్షం
మాడవీధుల చుట్టుపక్కల మబ్బులు కమ్మి భారీ వర్షం కురిసింది. గత కొద్దిరోజులుగా తిరుమలలో ఎండల తీవ్రతకు అల్లాడిపోతున్న భక్తులు, ఈరోజు కురిసిన వర్షంతో కాస్త ఉపశమనం పొందారు. తిరుమల కొండపై ఒక అరగంటసేపు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దీంతో ఒక్కసారిగా తిరుమల పుణ్యక్షేత్రం చల్లగా మారిపోయింది. చల్లటి గాలులతో, ఆహ్లాదకర వాతావరణంలో భక్తులు కూల్ అయ్యారు.
కేవలం తిరుమలలోనే వర్షం.. భక్తుల సంతోషం
కేవలం తిరుమలలోనే ఎండ తీవ్రతను తట్టుకోలేక పోతున్న భక్తుల కోసమే అన్నట్టు వర్షం కురవడంతో భక్తులు ఇదంతా ఏడుకొండల వాడి మహిమ అంటున్నారు. దర్శనానికి వచ్చిన భక్తులు కాసింత సేద తీరేలా ఆ వెంకటేశ్వర స్వామి వర్షం కురిపించాడు అని సంబరపడుతున్నారు.
ఏపీలోని వివిధ ప్రాంతాలకు వర్ష సూచన
ఇదిలా ఉంటే తిరుమలలో మాత్రమే కాకుండా వాతావరణ శాఖ సూచనల ప్రకారం రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తాలో పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని చెబుతున్నారు. శుక్ర, శనివారాల్లో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని, రాయలసీమలోనూ వివిధ ప్రాంతాలలో గంటకి 40 కిలోమీటర్ల నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరిస్తున్నారు.












Click it and Unblock the Notifications