ఏపిలో విస్తారంగా వర్షాలు: పొంగుతున్న వాగులు
విజయవాడ: అల్పపీడన ద్రోణి ప్రభావానికి తోడు ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా ఉండటంతో ఆంధ్రప్రదేశ్‌లోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శనివారం రాత్రి నుంచి ప్రారంభమైన వర్షాలు సోమవారం కూడా కొనసాగుతున్నాయి. దీంతో వాగులు పొంగుపొర్లుతున్నాయి. దీంతో పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పలు గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాలు నీటి మునిగిపోయాయి.
గుంటూరు జిల్లాలో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులో పడి ఓ మహిళ మరణించగా, ఆమె సోదరి గల్లంతయ్యారు. ప్రకాశం జిల్లాలో ఓ పాఠశాల భవనం కూలీ ఓ విద్యార్థి మృతి చెందాడు. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. అటు గుండ్లకమ్మ ప్రాజెక్టుకు భారీగా వర్షపు నీరు వచ్చి చేరడంతో అధికారులు ప్రాజెక్టు 5 గేట్లను ఎత్తి వేసి 18వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో మద్దిరాలపాడు వద్ద గుండ్లకమ్మ ఉధృతంగా ప్రవహిస్తుండటంతో చీరాల-ఒంగోలు, పర్చూరు-ఒంగోలు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

జిల్లాలో కురుస్తున్న వర్షాల కారణంగా ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు 70 గేట్లను ఎత్తివేసి లక్ష క్యూసెక్కుల నీటిని సమ్రుదంలోకి విడుదల చేశారు. డెల్టా కాల్వలకు 12వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రకాశం బ్యారేజీ ప్రస్తుత నీటిమట్టం 12 అడుగులుగా ఉంది. పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజీకి 92వేల క్యూసెక్కుల నీరు వచ్చిచేరింది. పులిచింతల ప్రాజెక్టు 9గేట్లు ఎత్తివేసి, 90,700 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
తుంగభద్ర నదికి కూడా భారీగా వరదనీరు చేరుతోంది. సుంకేశుల బ్యారేజీకి కూడా భారీగా నీరు చేరుకుంది.
వర్షాల కారణంగా విజయవాడ దుర్గగుడి ఘాట్ రోడ్డును అధికారులు మూసివేశారు. అనంతపురంలో జిల్లాలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలోని మడకశిరలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గుంటూరు జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు వాగులు పొంగుతున్నాయి. ఎద్దువాగులో ఓ లారీ చిక్కుకుపోయింది.
కాగా, శ్రీశైలం ఎడమ గేటు కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ఇది ఇలా ఉండగా మరో 24 గంటలు కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications