Cyclone Fengal: ఫెంగల్ తుపాను తీవ్రం-ఏపీలో దంచికొడుతున్న వర్షాలు..!
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కాస్తా ఫెంగాల్ తుపానుగా మారి ఇవాళ పుదుచ్చేరి వద్ద తీరం దాటబోతోంది. ఈ నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా బారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా రాయలసీమ జిల్లా నుంచి మొదలుపెట్టి దక్షిణ కోస్తా వరకూ వీటి ప్రభావం కనిపిస్తోంది. నిన్న రాత్రి నుంచి మొదలైన ఈ వర్షాలు రెండు రోజుల పాటు తప్పేలా లేవు. ఇప్పటికే వాతావరణ కేంద్రం నాలుగు జిల్లాలకు ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరికలు కూడా చేసింది. దీంతో ప్రభుత్వం అలర్ట్ అయింది.
ఫెంగల్ తుపాను ప్రభావంతో నెల్లూరు జిల్లాలో నిన్నటి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. నైరుతి బంగాళాఖాతంలో పుదుచ్చేరి వైపు కదులుతున్న ఫెంగల్ తుఫాన్ ఇవాళ మధ్యాహ్నం కరైకల్- మహాబలిపురం మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో తమిళనాడుతో పాటు రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. తీరప్రాంతాల్లో గంటకు 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఏ క్షణమైనా ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందన్న అధికారుల అలర్ట్ తో ఎన్డిఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి.

బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను ప్రభావంతో కాకినాడ జిల్లా తుని నియోజకవర్గ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పల్లపు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. పంట చేతికి వచ్చే క్రమంలో ఈ వర్షాలు రైతాంగాన్ని ఇబ్బంది పెడతాయేమో అన్న భయం రైతుల్ని వెంటాడుతోంది. అలాగే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా పలు పోర్టుల్లో మూడో ప్రమాద హెచ్చరికలు కూడా జారీ చేసారు. మత్సకారుల్ని ఇప్పటికే వేటకు వెళ్లకుండా నియంత్రిస్తున్నారు. తుపాను తీరం దాటాక వర్షాల ప్రభావం మరింత పెరిగే అవకాశముంది.












Click it and Unblock the Notifications