సంక్రాంతికి అదిరిపోయే ఆఫర్, రూ 5 వేలకే హెలికాప్టర్ రైడ్ - ఇక చుట్టేయండి..!!
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. సొంత ఊర్లకు వెళ్లే వారితో జాతీయ రహదారులు కిటకిటలాడుతున్నాయి. గోదావరి జిల్లాల్లో సంక్రాంతి సందడి ఊపందుకుంది. పలు ప్రాంతాల నుంచి గోదావరి గట్టున సాగే సంక్రాంతి వేడుకలను చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఇక.. ఈ సారి సంక్రాంతి వేళ.. ప్రత్యేకంగా పడవల పోటీలు.. ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేసారు. ఇక.. కోడిపందాలకు బరులు సిద్ధమయ్యాయి. ఇదే సమయంలో హెలికాప్టర్ రైడ్ సైతం అందుబాటులోకి తీసుకొచ్చారు. తక్కువ ధరలతో ప్యాకేజీలు ఖరారు చేసారు.
సంక్రాంతి వేళ సంప్రదాయ ఆటలు... పిండి వంటలు కామన్. ఈ సారి కోనసీమలో ప్రత్యేకంగా హెలికాప్టర్ రైడ్ అందుబాటులోకి తీసుకొచ్చారు. హైద్రాబాద్‌కు చెందిన విహాగ్ సంస్థ పండగ 3 రోజులూ ఈ అవకాశం కల్పిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం సీతారాంపురం లోని స్వర్ణాంధ్ర కాలేజీలో దీనిని ఏర్పాటు చేస్తున్నారు. రైడ్‌లో.. అంతర్వేదిఆలయం, సాగర తీరం, లైట్ హౌస్, అన్న చెల్లెళ్ల గట్టు, కోనసీమ జిల్లాలోని కొబ్బరి చెట్ల అందాలను వీక్షించొచ్చు. టికెట్ ధర రూ.5వేలు కాగా, 25 కి.మీ.మేర 25 నిమిషాల పాటు గగనంలో విహరించొచ్చేలా ప్లాన్ చేసారు. సంక్రాంతికి నర్సాపురం కు వచ్చే వారికి ఈ అవకాశం ప్రత్యేకంగా కల్పిస్తున్నారు. కాగా, ఇక ఇప్పటికే గోదావరి జిల్లాల్లో కోడి పందాల కోసం బరులు సిద్ధమయ్యాయి.

భీమవరం, నర్సాపురం ప్రాంతాలువాహనాలతో రోడ్లు రద్దీగా మారుతున్నాయి. ప్రధానంగా భీమ వరం పట్టణంలో ఎటు చూసినా వాహనాల రద్దీ కనిపిస్తోంది. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు వంటి ప్రాంతాల నుంచి కేవలం పండగ కోసం వస్తున్న వాహనాలతో పట్టణం కిక్కిరిసింది. ఇవికాకుండా పండుగ నేపథ్యంలో చుట్టు ప్రాంతాల నుంచి షాపింగ్‌లకు వచ్చేవారి వాహనాలు అదనం. కోడిపందాలు, సంక్రాంతి సంబరాలకు ఏటా ఇతర రాష్ర్టాల నుంచి వేలాది మంది వస్తుంటారు. ఈ ఏడాదికూడా ముందుగానే హోటళ్లు బుక్ చేసుకున్నవారు వాహనాలతో తరలి వస్తుండడంతో పట్టణమంతా సందడి నెలకొంది.
ఇక.. జాతీయస్థాయి డ్రాగన్ పడవ పోటీలు సోమవారం ఉత్సాహభరితంగా సాగాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం-తాడిపూడి వంతెన నుంచి ఉచ్చిలి వరకూ సెంట్రల్ డెల్టా ప్రధాన కాలువలో కిలోమీటరు పరిధిలో ఈ పోటీలు ఉత్కంఠభరితంగా సాగాయి. కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల నుంచి మొత్తం 22 టీమ్‌లు పాల్గొన్నాయి. ఇందులో ప్రథమ విజేతకు రూ.2లక్షలు, ద్వితీయ విజేతకు రూ.లక్ష, తృతీయ రూ.50వేల నగదుతోపాటు, ట్రోఫీలతో సత్కరించను న్నారు. పోటీలను తిలకించేందుకు వేలాదిమంది తరలివచ్చారు.












Click it and Unblock the Notifications